నిజానికి సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అది మనకు ఎంతో నమ్మకమైన మిత్రపక్షం. కానీ రష్యా ముక్కలు చెక్కలైపోయి బలహీనపడిన తర్వాత భారత్‌కి నిజమైన మిత్రులు కరువయ్యారు. కేవలం కొన్ని కొన్ని చిన్న, పేద దేశాలు మాత్రమే భారత్ వైపు ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో అమెరికా భారత్‌కు మిత్రదేశంగా కపటనాటకం చూపిస్తూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోంది. కేవలం బిల్‌క్లింటనో లేక ఒబామానో మన దేశానికి వచ్చినంత మాత్రాన, భారతీయులు ఎక్కువగా అక్కడ ఉన్నారని కాకుండా చెప్పుకుంటే నిజానికి అమెరికా ఎప్పుడు భారత్‌కి నమ్మకమైన దేశం కాదు. పాకిస్థాన్‌ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కేవలం చైనాను భయపెట్టడానికే మనల్ని వాడుకుంటోంది.
మరోవైపు భారత్‌లో మార్కెటింగ్‌కు బహు అవకాశాలు ఉన్నందున వ్యాపార బంధాల కోసమే నటిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ హయాంలో, ఆయన కేబినెట్‌లోని రక్షణమంత్రులుగా పనిచేసినవారు చేసిన పాపాలు అన్ని ఇన్నికావు. చైనాను, పాకిస్తాన్‌ని నిలువరించలేకపోయారు. మన భూభాగాలను కూడా కోల్పోయిన మనం పనికిమాలిన సహన మంత్రం పాటిస్తున్నాం. అదే నాడు వల్లభాయ్ పటేల్ వంటి వారు ప్రధాని అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక మన విదేశాంగ విధానంలో పొరుగుదేశాల విషయంలో జోక్యం చేసుకోకూడని ఉంది. కానీ పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ని విభజించే సమయంలో మనం చేసిన తప్పే పాక్‌కి ఆయుధమైంది.
ఇక శ్రీలంకలో ఎల్‌టిటిఈని అణిచివేయడానికి సహకరించి రాజీవ్ పెద్ద తప్పిదమే చేసి, తన ప్రాణాలు కోల్పోయాడు. ఇకనైనా విదేశాంగ విధానాలను మార్చాలి. సుబ్రహ్మణ్యస్వామి చెప్పినట్లుగా పాక్‌పై మనం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలి. పాక్‌కి ఉన్న 'అత్యంత ప్రాధాన్యత దేశం' హోదాని తీసివేస్తే పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాక్‌ని అంతర్జాతీయ విధానాలతో ఏకాకిని చేయాలి. మరోవైపు పాక్‌కి మన సైనిక సత్తా చాటాలి. చిన్న దేశాలైన ఉత్తరకొరియా, ఇజ్రాయిల్‌లా మారాలి. మన విదేశాంగ విధానంలోని లోపానికి ఒకే ఒక్క పరాకాష్ట ఏమిటంటే.. మన పొరుగున ఉన్న చిన్న చిన్నదేశాలు కూడా భారత్‌కి అనుకూలం కావు.