నిన్నటివరకు జాతీయ చిత్రాలంటే బాలీవుడ్ చిత్రాలే. మన చిత్రాలకు ప్రాంతీయ చిత్రాలనే బిరుదుని ఇచ్చి తొక్కిపెట్టారు. దానికి ఒకే ఒక్క కారణం హిందీ తెలిసిన రాష్ట్రాలు ఎక్కువగా ఉండటమే. అయితే చాలా ఉత్తరాది రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ వారికి హిందీ కూడా వచ్చు. దాదాపు వారి భాషలు హిందీనే పోలివుంటాయి. దానికి తోడు హిందీని జాతీయ భాష చేయడం, జాతీయ మీడియా ఎక్కువగా ముంబై, ఢిల్లీలలో కేంద్రీకృతమై ఉండటం కూడా దీనికి కారణం. కానీ ఇప్పుడు యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్-రాజమౌళిల 'బాహుబలి'తో ఉత్తరాది స్టార్స్, ఫిల్మ్ మేకర్స్ బిత్తర చూపులుచూస్తున్నారు.
ఓ దక్షిణాదికి చెందిన ప్రాంతీయ భాష అయిన, అందునా ఉత్తరాదిలో మదరాసీలుగా గుర్తింపు ఉన్న తెలుగు హీరో ఈ స్థాయి ప్రభంజనం చూపడం వారు తట్టుకోలేకపోతున్నారు. ఇగో అడ్డుపడుతోంది. గతంలో రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు బాలీవుడ్‌లోకి ప్రవేశించినా మొదట వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోలేకపోయారు. ఇక తెలుగులో కులాల వారీగా చీలిపోయిన ప్రేక్షకులు ఏ హీరోకు కూడా పూర్థిస్థాయి ఇమేజ్‌ను కట్టబెట్టలేదు. ఇలా మన హీరోయిన్లు మాత్రమే బాలీవుడ్‌లో టాప్‌కు చేరి, హీరోలు రిజెక్ట్ కావడానికి సవాలక్ష కారణాలున్నాయి.
తాజాగా వర్మ చెప్పినట్లుగా రీజనల్ స్థాయిలో ఆలోచించి, కులాల వేటలో ఉన్న హీరోలు ఇక్కడికే పరిమితమైపోయారు. కానీ ప్రభాస్ చాలా వరకు తనపై కుల ముద్ర పడకుండా చూసుకున్నాడు. దాంతో ఆయన నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో ఆలోచించి, నేడు దేశంలోనే నయా సూపర్‌స్టార్‌గా అవతరించాడు. కానీ ప్రభాస్‌ది కూడా మూడునాళ్ల ముచ్చట కాకూడదు. అందుకు ఆయన జాగ్రత్తగా అడుగులు వేయడం అవసరం. ఇతర దక్షిణాది హీరోలు చేసిన తప్పులను ఆయన గమనించాలి. మంచి దర్శకులతో ముందుకు సాగాలి. బాలీవుడ్‌లో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తారు. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇప్పటికే 'సాహో' టీజర్ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. కాబట్టి తన తదుపరి చిత్రాల విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకోవాలి....!