జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి మంచి భావాలున్నా కూడా ఆయనకు సరైన సలహాదారులు, వ్యూహకర్తలు లేరని అర్దమవుతోంది. దక్షిణాదిపై సవతి ప్రేమ, తెలుగు రాష్ట్రాల సమస్యలపై మాత్రమే పవన్ స్పందిస్తున్నాడు. తాజాగా ఆయన మిర్చిరైతుల విషయంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మిర్చిరైతులను ఆదుకోవాలని, వారికి కనీసం మద్దతు ధర క్వింటాల్‌కు 11వేలైనా చెల్లించాలని చెప్పాడు. ఎంత మంది రైతులు ఎంత విస్తీర్ణంలో మిర్చి పంటను పండించారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజమే.. గతేడాది మిర్చికి మంచి రేటు లభించడంతో ఈసారి కూడా మిర్చిని పండిస్తే ఆర్థికంగా నిలబడతామని, పాత అప్పులు తీర్చవచ్చని రైతులు మోజు పడ్డారు. కానీ వ్యవసాయ మంత్రులు, శాఖా అధికారులు మాత్రం ఎక్కువగా దాని మీదే ఆధారపడ వద్దని రైతులకు చెప్పడంలో విఫలమయ్యారు. ఎక్కడ రేటు తగ్గిపోతుందోనని రైతులు తమ పంటలను ఖమ్మం, గుంటూరు వంటి మిర్చియార్డ్‌లకు తరలించారు. ఇంత పెద్ద ఎత్తున పంట రావడంతో వ్యాపారులలో, దళారుల్లో ఆశ మొదలైంది. చాలా తక్కువ రేటుకు కొంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలించిన రవాణా ఖర్చులు కూడా రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మరోపక్క మిర్చి మార్కెట్ ధరకు, రైతుల మద్దతు ధరకు అంత వ్యత్యాసం ఎందుకు ఉందో నాయకులు, అధికారులు వివరించాలి. సామాన్యంగా తన భావాలను పంచుకోవడంలో, ఆవేశంలో పవన్ ఎక్కడా తగ్గడు. కానీ ఆయన ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రకటన ఇచ్చాడు? రెండు రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉంది కదా..! మరి పవన్ ఈ విషయంలో పేర్లు చెప్పడానికి వెనుకంజ వేశాడు. మరోపక్క పవన్ కిసాన్‌ల పరిస్థితితో పాటు తన ప్రతి ప్రసంగంలో చెప్పే 'జైహింద్' కోసమైనా పాక్‌సైన్యం భారత్ జవాన్లపై చేస్తున్న అకృత్యాలపై నోరు విప్పి ఉంటే బాగుండేది. నోరు విప్పడం అంటే రాజకీయం చేయడమే కాదు కదా..! చివరకు క్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్ సైతం ముందుకొచ్చి పాకిస్తాన్‌కి పెద్ద బుద్దే చెప్పాలని వ్యాఖ్యానించాడు. మరి ఈ విషయంలో పవన్ స్పందించకపోవడం బాధాకరం...!