తమ రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో మనం ఉగ్రవాదులపై సరైన చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా తమ ఆధిపత్యాన్ని చూపించాలని భావిస్తున్న తరుణంలో కేవలం భారత్ పెద్దన్న తరహాలో మౌనంగా ఉండటం ఆక్షేపణీయం. తాజాగా పాక్ సైన్యం నియంత్రణ రేఖను దాటి, పలు నిబంధలను తూచ్ అంటూ ఇద్దరు వీరజవాన్లను చంపడమే కాదు.. ముక్కలు ముక్కలుగా తెగనరికింది.
వాస్తవానికి ఇందిరాగాంధీ తర్వాత దేశానికి ధీటైన ప్రధాని రాలేదు. కారణం.. పూర్తి మెజార్టీ లేకపోవడమే. కానీ ఆ సువర్ణావకాశం ఇప్పుడు మోదీకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ హయాంలో పాక్ పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. వారు ఏమి చేసినా చూస్తూ ఊరుకున్నారు. కానీ ఒకానొక దశలో బిజెపి మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కాందహార్ హైజాక్‌కు తలవంచింది. ఇక దావూద్ ఇబ్రహీం నుంచి ఎందరో పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నా కూడా భారత్ బలమైన సాక్ష్యాలు చూపించడం లేదనే సాకుతో అంతర్జాతీయ ప్రపంచం మౌనంగా ఉంది. ఇది నిజంగా భారత విదేశాంగ, రక్షణ శాఖల్లోని వైఫల్యమే.
ఇక పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టడానికి మోదీ సర్కార్ స్వేచ్ఛ నిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సైనికుల వద్ద ఆధునిక ఆయుధాలు లేవు. నాసిరకం తిండిని పెట్టి ప్రశ్నించిన వారిని తీసి వేస్తున్నారు. దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఇక వెంకయ్య చెప్పినట్లు 'మాకు విల్ ఉంది.. ఖచ్చితంగా కిల్ ఉంటుంది' అన్నాడు. ఇక్కడ కూడా ప్రాస కోసం కాకుండా నిజాయితీగా వ్యవహరించండి. ఎనిమిదేళ్లు రక్షణ మంత్రిగా పనిచేసిన ఆంటోని తన కాలంలో ఇలాంటి ఘటన ఒకే ఒక్కటి జరిగిందని, కానీ మోదీ వచ్చిన మూడేళ్లలో మూడు సార్లు జరిగాయని సెలవిచ్చాడు. మరోవైపు కపిల్‌సిబాల్ మోదీకి గాజులు పంపాలని వ్యాఖ్యానించి రాజకీయ కోణంలో చూస్తున్నారు. డిగ్గీ రాజా వంటి వ్యక్తులు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని, మరికొందరు నాయకులు సైనికుల పటిమను దెబ్బతీస్తున్నారు. మరి ఈ విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది..!