తెలుగు సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావుది ఒక ప్రత్యేక నైజం. కామెడీ, సెంటిమెంట్, విలనీ.. ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. తన కెరీర్ మొదటి రోజుల్లోనే స్వర్గీయ ఎన్టీఆర్‌పై వచ్చిన వ్యంగ్య చిత్రాలలో ఎన్టీఆర్‌లా నటించి తన సత్తాచాటాడు. కానీ సినిమాను సినిమాగా, కళాకారుడిని కళాకారుడిగా చూడలేని కొందరు ఆయనపై హత్యాయత్నం సైతం చేయబోయారు. ఇక ఆయన అప్పుడెప్పుడో సినీ కార్మికుల సంక్షేమం కోసం, సినీ పరిశ్రమ బాగు కోసం దీక్ష చేశారు.
దీని ఎఫెక్ట్ తన సినీ కెరీర్‌పై ఎంతో పడిందని ఆయన చెప్పుకొచ్చారు. పరిశ్రమలో ఎందరో ఉండగా.. నువ్వే ఎందుకు దీక్ష చేయాలి? ఇంకా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు కదా..! అని కొందరు వారించినా తాను వినలేదని, పరిశ్రమ బాగుకోసం దీక్ష చేశానన్నారు. తాను దీక్ష చేయడం దాసరి నారాయణరావు, చిరంజీవిలకు కూడా నచ్చలేదని, దాంతో తనను దీక్షను ఆపేలా ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని రామానాయుడు, వి.బి.రాజేంద్రప్రసాద్‌లు తనతో చెప్పారని, వారికి 'వాడిని అక్కడి నుంచి లేపండ్రా' అని ఫోన్‌లు వచ్చాయని, దాసరి దీక్షను ఆపమని తనతో చెప్పించారని, కానీ ఎవ్వరినీ అడిన నేను దీక్ష మొదలుపెట్టలేదు కాబట్టి ఎవరు చెప్పినా దీక్ష విరమించనని చెప్పానని గుర్తు చేసుకున్నారు. దీంతో చిరంజీవి, ఆయన నిర్మాతలు, దాసరి వంటి వారు తనకు అవకాశాలు ఇవ్వలేదని, కానీ కృష్ణ, శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి వారు అవకాశం ఇవ్వడంతో బిజీగా గడిపానని, కానీ వారు కూడా చాన్స్‌లు ఇవ్వకపోతే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
మొత్తానికి పరిశ్రమలోని లుకలుకలను, అమ్మపెట్టదు.. అడక్కతిననివద్దు అనే సామెతలతోపాటు ఇండస్ట్రీ కేవలం తమ కనుసైగల్లోనే నడవాలని శాసించే మనుషులు జీవితాలను కోట నిజాయితీగా, భయపడకుండా బయటపెట్టారు.