పూరీజగన్నాథ్.. ఈయన పేరుకు ఉండే క్రేజ్ వేరు. స్టయిల్ ఆఫ్ మేకింగ్ నుంచి అనుకున్న సమయంలో అనుకున్న అవుట్‌పుట్ లభించేలా చేయడంలో ఆయన సిద్దహస్తుడు. అందునా ఆయన హీరోలను ప్రజెంట్ చేసే విధానం, ఇతర దర్శకులు పదినిమిషాలలో చూపించే వీరోచిత హీరోయిజాన్ని పూరీ కేవలం ఒక చిన్న పంచ్ డైలాగ్‌లో చెప్పేస్తారు. హీరోలను ఆయన చూపించే స్టైల్ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది.
అందుకే ఎన్ని ఫ్లాప్‌లొచ్చినా ఆయనతో చిత్రాలు తీసే నిర్మాతలు, హీరోలకు కొదువ వుండదు. ఇక కొత్తటాలెంట్‌ను వినియోగించుకోవడంలో పూరీ స్టైలే వేరు. నాటి చక్రి నుంచి నేటి అనూప్ వరకు, నేడు దర్శకులుగా మారి తమ సత్తా చూపిస్తున్న పలువురు యువదర్శకులు కూడా ఆయన చిత్రాలకు పనిచేసిన వారే. వర్మ శిష్యుడు కావడంతో పూరీదే అదే శైలి.కాగా గతంలో ఆయన భాస్కరభట్ల వంటి పాత్రికేయులకు కూడా పాటల రచయితలుగా మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు.
ప్రస్తుతం పూరీ బాలయ్యతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్‌ను మండు వేసవిలో కూడా జోరున పరుగెత్తిస్తున్నాడు పూరీ. ఇక బాలయ్య అంటే దర్శకుల హీరో. ఎంత సీనియర్ అయినా దర్శకుల పనిలో వేలుపెట్టరు. వారిపై పరిపూర్ణ విశ్వాసాన్ని చూపిస్తారు. అందుకే పూరీ స్వేచ్చగా తనకు నచ్చిన అనూప్‌రూబెన్స్‌ను సంగీత దర్శకునిగా పెట్టుకుని 'బాలయ్య గుండెల్లో గోలీసోడా' కొట్టించే గీతాన్ని ప్రముఖ పాత్రికేయుడు, పీఆర్వీ, పలు పుస్తకాలు సారీ.. సినీ సుగంధ గ్రంథాల రచయిత, కవి పులగం చిన్నారాయణ చేత ఈ మాస్ పాటను రాయిస్తున్నాడు. స్వతహాగా ఎంతో క్లాస్‌గా, సున్నితభావాలు కలిగిన పులగం చేత పూరీ మాస్ పాటను రాయించి అభిమానులను అలరించనుండటం విశేషం.