నిజమైన వామపక్ష నాయకులే లేరని బాధపడుతుంటే బడా పెట్టుబడిదారులైన చంద్రబాబు, జగన్‌లు తామే కార్మికుల, కర్షకుల మేలు కోరేవారిమని చెప్పి తరించారు. సోమవారం రైతుదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌కి వెంటనే మేడే గుర్తుకొచ్చి, రోజంతా కష్టపడే కార్మికులు గుర్తుకొచ్చారు. దాంతో జెండాను ఎగురవేసి తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొచ్చాడు. మరోవైపు చంద్రబాబు నాయుడైతే నన్ను మించిన కార్మికుడు, శ్రామికుడు లేడు.రాత్రనక పగలనక మీకోసం గొడ్డుచాకిరి చేస్తున్నాను.
కానీ ఇష్టంతో కష్టపడుతున్నాను కాబట్టి నాకు శ్రమ తెలియడం లేదు. మీరు కూడా ఇష్టంగా కష్టపడడంటూ కార్మికులకు హితబోధ చేశాడు. అంటే కార్మికులంతా కష్టపడి, అది కూడా ఇష్టంతో కష్టపడి,రోజుకు 12 కాదు 20 గంటలు కష్టపడి యాజమాన్యాలను బిలియనీర్లను, ట్రిలియనీర్లను చేయాలన్నమాట.
ఇంతకీ జగన్‌కి చెందిన కంపెనీలలో కార్మికులకు జీతాలు ఎలా ఇస్తున్నారు? చంద్రబాబు హెరిటేజ్‌లోని కార్మికుల పరిస్థితి ఏమిటి? వాటికి చట్టాలు వర్తించవా? జగన్, చంద్రబాబులకున్న రాజసౌదాలు ఎవరు కష్టపడితే వచ్చాయి? వాటిని, వారి ఆస్తులను, సంస్థల్లో లాభాలలో వాటాలలో కొంత భాగాన్ని ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వవచ్చు కదా..! అసలు పుచ్చలపల్లి సుందరయ్య లాగా తనపేరు చివరన ఉన్న రెడ్డి అనే తోకను జగన్, నాయుడు అనే తోకను చంద్రబాబు తెగ్గొసుకోవచ్చు కదా..! ఇక చంద్రబాబు అయితే మరో జోక్ పేల్చాడు.
కార్మికులంతా తనలాంటి కార్మికుడిని చూసి మొదట తనకే సన్మానం చేయాలట...! వినేవాడుంటే హరిదాసు ఇంగ్లీషులో హరికథలు చెబుతారంటే ఇదే కాబోలు....!