చంద్రబాబు మంచి రాజనీతిజ్ఞుడే. ఆయన నిద్రాహారాలు లేక రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడనే అనుకుందాం. ఓ సభకు, ఓ కీలక సమావేశానికి, విదేశీ ప్రతినిధులు హాజరయ్యే మీటింగ్‌లకు, సెమినార్లకు ఆయన హాజరయ్యేటప్పుడు ఏమి మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనేది ఎంతో హోం వర్క్ చేస్తారు. కానీ ఈమధ్య ఆయన కూడా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు.
అంతటి రాజనీతిజ్ఞులైన వాజ్‌పేయ్, పివినరసింహారావులు కూడా ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వస్తే ఆచితూచి మాట్లాడేవారు. కానీ నేడు తెలుగుదేశం పార్టీ వారిని చూస్తుంటే అసలు మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఏమైనా హోంవర్క్ చేస్తున్నారా? లేక మైక్ చేతికి చిక్కితే ఏం మాట్లాడుతున్నామో మైమరిచిపోతున్నారా? అనే అనుమానం రాకమానదు. స్వయాన సీఎం చంద్రబాబు తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఏదో మాట్లాడబోయి.. ఏదేదో మాట్లాడుతూ.. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు.
పోనీ మా సీఎం తనయుడు, కాబోయే సీఎం కదా..! అని ఆయన మెప్పుపొందడానికి లోకేష్‌ని సమర్ధిస్తున్న సీనియర్లయిన సోమిరెడ్డి వంటి వారు కూడా అభాసుపాలవుతున్నారు. సుజనా గారైతే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని పందులాటతో పోల్చాడు. ఇక మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జలీల్‌ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పాడు. తాజాగా కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి డిగ్రీలో సిఈసీ చదివాడట.
ఆహా.. ఏమి భాగ్యం.. అసలు వీరికి ఉన్న డిగ్రీలు చదివి తెచ్చుకున్నవా? లేక బజారులో కొనుగోలు చేసే సరికి వీరికి ఏ క్లాసులో, ఏ గ్రూప్‌లో ఏ సబ్జెక్ట్ ఉండేది తెలియడం లేదా? అనే చిన్న సంశయం కలుగుతోంది. బాబూ.. ఇకనైనా.. నీ తమ్ముళ్లకు చెప్పవయ్యా.. చెప్పు.. లేకపోతే నువ్వే అభాసుపాలవుతావు...!