సమసమాజ స్థాపన కోసం.. ప్రజల బాధలు, శ్రామికుల, కార్మికుల కష్టాలనే తమ కష్టాలుగా భావించి, కుమిలిపోయి... నలిగిపోయి.. తమ జీవితాలను త్యాగం చేసిన విప్లవాల పురిటిగడ్డ భారతదేశం అంటే చాలా మందికి రుచించకపోవచ్చు. చైనాలోనో, రష్యాలోనో వాన పడితే ఇక్కడ గొడగులు పట్టే కమ్యూనిస్టులు ఈమధ్యకాలంలో తయారయ్యారు. నేటి కామ్రేడ్లలో చాలా మందికి మేడే ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు. కేవలం దానిని ఓ వామపక్ష పండుగగా చూస్తారు. కానీ తమ సొంత ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు మేడే రోజున సెలవు కూడా ఇవ్వరు. కామ్రేడ్లే కామ్రేడ్లకు శత్రువులుగా మారుతున్నారు.
మావో చెప్పినా, లెనిన్ చెప్పినా ఆ భావాలు ఒక్కటే. భగవద్గీత, ఖురాన్, బైబిల్.. ఇలా ఏది చెప్పినా సారాంశం ఒక్కటే అన్నట్లుగా మావో అయినా, లెనిన్ అయినా చెప్పింది ఒక్కటే. దారులు వేరు కావచ్చు. కానీ నేడు నిజమైన కామ్రేడ్లను టార్చ్‌లైట్ వేసి వెతకాలి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఎర్రజెండాలు పాతి, తమ బినామీలకు, తమ బంధువులకు, తామే దోచుకుంటూ, అమ్ముకుంటూ కోట్లు పడగలెత్తుతున్నారు. వేలాది ఎకరాలను త్యాగం చేసి, సుందరరామిరెడ్డిని సుందరయ్యగా మార్చుకున్న పుచ్చలపల్లి వంటి వారు ఇప్పుడు కనిపించరు. నేడు కమ్యూనిజం అనేది పనికిమాలిన భావజాలంగా మారడానికి పెట్టుబడిదారులే కాదు.. స్వయాన కామ్రేడ్లు కూడా బాధ్యులే. నేడు వామపక్ష పార్టీలు కూడా కుల ఆధిపత్యంలో, కులాల కుమ్ములాటలో సతమతమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం నవ్వులపాలవుతోంది. పిడి విధానాలను, నక్సలిజం పేరుతో అన్యంపుణ్యం ఎరుగని జవాన్లను మట్టుబెడుతున్నారు. నిజంగా శ్రామికుల, కార్మికులను దోచుకుంటున్న బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వ్యాపారుల వద్ద ముడుపులు పుచ్చుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కేవలం తాము ఇప్పటికీ ఉన్నాం.. అనే తమ ఉనికిని చాటుకోవడానికి బతుకులీడుస్తున్నారు. ఒకానొక దశలో దేశంలోని పశ్చిమ బెంగాల్‌ను తనదైన శైలిలో ఏకచ్చత్రాధిపత్యంగా పాలించి, రికార్డులు సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. నిజంగా ఆయనే ప్రధాని అయి ఉంటే తన అద్భుత పాలనా పటిమతో ఆయన దేశ గతిని మార్చి మరలా కమ్యూనిజానికి ఊపిరిలూది, నేటితరానికి కూడా కమ్యూనిజం అంటే ఏమిటో రుచి చూపించేవాడు. కానీ వామపక్షాల నాయకులు గూడుపుఠాణి చేసి చారిత్రాత్మక తప్పిదంగా జ్యోతిబసుకు పదవి దక్కకుండా చేశారు. కమ్యూనిజం భావాలు గొప్పవే.. కానీ నేటి కమ్యూనిస్ట్‌లు మాత్రం నమ్మదగిన వ్యక్తులుగా కనిపించడం లేదు.