బాహుబలి ద కంక్లూజన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. విడుదలైన అన్ని చోట్లా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతూ మిగతా చిత్రాల రికార్డువులను బద్దలు కొడుతూ టాప్ హీరోలకు సైతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. గత గురువారం రాత్రి నుండే మొదలైన బాహుబలి సందడి ఈ సోమవారం మే డే కావడంతో ఇంకా కొనసాగుతూనే వుంది. వీకెండ్ కావడం... మే డే తో సోమవారం కూడా సెలవు కావడంతో బాహుబలికి బాక్సాఫీస్ వద్ద ఎదురు లేకుండా పోయింది. ఇక బాహుబలి చిత్రం యూఎస్ బాక్సాఫీస్ ని కూడా షేక్ చేస్తుంది. గత మూడు రోజులకు గాను యూఎస్ బాక్సాఫీస్లో బాహుబలి చిత్రం 10.13 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది అంటున్నారు. 10.13 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 64 కోట్ల రూపాయలను కొల్లగొట్టి శెభాష్ అనిపించింది.
దీంతో ప్రముఖ వెబ్సైట్ ప్రకటించిన యూఎస్ బాక్సాఫీస్ వీకెండ్ లిస్టులో మొదటి మూడు చిత్రాల్లో బాహుబలి-2 కూడా ఒకటిగా నిలిచింది. అయితే మిగిలిన మొదటి రెండు చిత్రాలు హాలీవుడ్ చిత్రాలు కావడం... ఇక మూడో స్థానంలో ఒక తెలుగు దర్శకుడు తీసిన బాహుబలి చిత్రం నిలవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ మొదటి రెండు హాలీవుడ్ చిత్రాల వివరాలు ఇలా వున్నాయి. ముందుగా ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’ 19.3 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలవగా, 12 మిలియన్ డాలర్లతో ‘హౌ టూ బి ఏ లాటిన్ లవర్’ రెండవ స్థానంలో నిలిచింది.
అలాగే బాహుబలి చిత్రం విడుదలైన బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్ లలో కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. భాష ఏదనేది లేకుండా అశేష జనవాహిని బాహుబలి చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు.