ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులు డబ్బులు లేక, ఏటీఎంలు పనిచేయక నానా ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా విడుదలైన 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రానికి గొప్ప వారే కాదు.. సామాన్యులు కూడా వేలకు వేలు ఖర్చుపెట్టి టిక్కెట్లు కొనుక్కుని చిత్రం చూస్తున్నారు. ఓ పదిరోజులైతే మామూలు రేట్లకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిసి కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా? అని వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దీనికి రాజమౌళిని, నిర్మాతలను ఎవ్వరినీ తప్పుపట్టలేం. ఇది వ్యాపారం. తాము పెట్టిన బడ్జెట్, పడిన కష్టం.. దానికి వచ్చే లాభాలు ఏ స్థాయిలో ఉండాలి? అని మాత్రమే మేకర్స్ ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఒక్క మాట మాత్రం వాస్తవం.
మోసం చేయడం చేతగాని, వైట్‌కాలర్ మోసాలు, అల్ప సంపాదన సంపాదించలేక, మండుటెండల్లో 45 డిగ్రీల వేడిలో కూడా రోజుకు 10 నుంచి 12 గంటలు ఎండల్లో కష్టపడి రోజుకు 300 రూపాయలు సంపాదించే బడుగు జీవి, కష్టజీవి మాత్రం ఆ 300 రూపాయలతో తన సంసారం ఎలా సాగుతుందా? ఎండలకి ఎండ దెబ్బ కొట్టి, రొక్కాడితే గానీ డొక్కాడని తన జీవితం ఒక రోజు పనికి వెళ్లలేకపోతే నోటిలోకి బువ్వ ఎలా పోతుందా? అని ఆలోచించే సగటు మనిషి మాత్రం 'బాహుబలి' టిక్కెట్ కొనే పరిస్థితుల్లో లేడు.
కానీ ఒక్క పచ్చినిజం ఏమిటంటే.. రాష్ట్రంలో మరీ బరితెగించి టిక్కెట్లను విచ్చలవిడి రేట్లకు అమ్ముతున్నా పట్టించుకునే నాధుడు లేని ఏపీలో మాత్రం బాహుబలి విడుదలై రోజుకు 6 నుంచి 10ఆటలు చొప్పున, 200రూపాయల టిక్కెట్‌ను 2వేలకు బ్లాక్‌మార్కెట్‌లో బ్లాక్‌టిక్కెట్లు అమ్ముతున్న వారు కూడా ఈ పదిరోజుల్లో ఏకంగా ఒక్కోక్కరు 50వేలు సంపాదించడం ఖాయం.సో.. కష్టపడి బతకకుండా బ్లాక్‌లోటిక్కెట్లు అమ్ముకోవడమే నయం..అనే ఆలోచనను కష్టజీవుల్లో మొలకెత్తేలా చేస్తున్నందుకు ప్రభుత్వాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి!