రాజమౌళి తన కలల సౌదం 'బాహుబలి'ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయనపై ఉన్న వ్యతిరేకత అంతా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం మీదనే. కానీ నేడు మెగాహీరోలు, నందమూరి హీరోల నుండి అందరూ అదే పనిచేస్తున్నారు కాబట్టి దీనిపై కూడా మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు.
ఇక మన హీరోల వారసులు, సోకాల్డ్ స్టార్స్ తాము ఏమి తీస్తే.. ప్రేక్షకులు అవే చూస్తారని, అభిమానులు ఏమి కోరుకుంటే తాము అవే చేస్తామని చెప్పి.. ఐదు డ్యూయెట్లు, ఆరు యాక్షన్ సీన్స్, రెండు మూడు తాగుడు సీన్స్, అబ్బో.. అదరగొట్టే పంచ్ డైలాగులు, స్టెప్స్‌తో సినిమాలు తీసి అవే తమ సినిమాలని చెప్పి, కోట్లకు కోట్లు బాక్సాఫీస్ వద్ద దోచుకుంటున్నప్పుడు రాజమౌళి వంటి దార్శనికుడు తన విజన్‌తో ఐదేళ్లు కోట్లు ఖర్చుపెట్టించి, ఇంత కష్టపడి, అహోరాత్రులు శ్రమించి, ఈ చిత్రాన్ని తీయడం సాహసమే. దానికి ప్రభాస్ వంటి హీరో అన్నేళ్లు సమయం కేటాయించి, మిగిలిన సోకాల్డ్ స్టార్స్‌లాగా తానేదో గొప్ప స్టార్‌నని ఊహించుకోకుండా, దర్శకుడు చెప్పినట్లు విని, ఈ చిత్రంతో ఇంకా పెద్ద స్టార్ కావడం అభినందించదగ్గ విషయం.
ఇక ఇది ఓ కార్పనిక కథ, నిజమైన చరిత్ర కాదు. అదే సమయంలో అన్ని సినిమాలలోగానే ఇందులో కూడా ధీరత్వంతో, ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రజలకోసం ముందుకు సాగే నాయకుడు విజయం సాదించడమే దీని సారాంశం కూడా. ఇక చెప్పుకోవాల్సింది ఏమీ లేదు...! ఇక రాజుల నేతులు తాగే చరిత్రలు మనకొద్దని చెప్పిన మహాకవి శ్రీశ్రీ చెప్పిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే.. ఇదొక ఉపయోగం లేని చిత్రమే.. అయినా రాజమౌళి, ప్రభాస్ వంటి వారి శ్రమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే....!