బాహుబలి చిత్రాన్ని గత ఐదేళ్లుగా ఒక మహా యజ్ఞంలా పూర్తి చేసి ఈ రోజు శుక్రవారం విడుదల చేశాడు డైరెక్టర్ రాజమౌళి. గత ఐదేళ్లుగా రాజమౌళి కుటుంబం మొత్తం బాహుబలి చిత్రం కోసం కష్టించింది. ఈ రోజు శుక్రవారమే విడుదలైన బాహుబలి ద కంక్లూజన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కిన బాహుబలి చిత్రానికి అశేష జనవాహిని నెత్తిన పెట్టుకుంది. జక్కన్న ఐదేళ్ల కలకి బాహుబలి విజయంతో సేదతీరే రోజు వచ్చేసింది. ఇక బాహుబలి చిత్రం విజయకేతనం ఎగురవేయడంతో రాజమౌళి తన ఫ్యామిలీతోపాటు కొన్ని రోజులు ఎవరికి దొరక్కుండా భూటాన్ వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఇక భూటాన్ వెళ్లొచ్చాక జక్కన్న తీయబోయే మరో చిత్రానికి సంబందించిన ప్రకటన వస్తుందని సమాచారం. బాహుబలి వంటి అతి పెద్ద ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ చిత్రం ఏమిటా అని అందరూ తెగ ఆలోచించేస్తూ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. జక్కన్న తదుపరి చిత్రం మహాభారతం అనుకుంటే కాదు దానికి మరో పదేళ్లు పడుతుందని రాజమౌళి సెలవిచ్చాడు. మరి ఇప్పుడు జక్కన్న తీయబోయే సినిమా ఏంటనే దానిమీద క్లారిటీ అయితే రాలేదు కానీ ఒక యంగ్ హీరోతో మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేస్తాడని చెబుతున్నారు జక్కన్న సన్నిహితులు.
ఇప్పటికే ఆ చిత్రానికి సంబందించిన స్టోరీ.. మిగతా ప్లాన్స్ సిద్ధంగా వున్నాయట. చాల తక్కువ బడ్జెట్ లో మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీస్తాడని.. అందులో హీరో గా ఎవరు నటిస్తారనే దాని మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే బాహుబలి తర్వాత అంతటి భారీ ప్రాజెక్ట్ అయితే ఇప్పడు తెరకెక్కించేందుకు మాత్రం రాజమౌళి సిద్ధంగా లేడని మాత్రం చెబుతున్నారు.