ఇటీవల 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం కోసం ఈ చిత్ర యూనిట్ ముంబైలో ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో కెమెరామెన్‌తో పాటు రానా కూడా ప్రభాస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అందులో తప్పులేదు. కానీ వారు మాట్లాడుతూ, నిజానికి అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌ల కన్నా ప్రభాస్ గొప్ప సూపర్‌స్టార్ అని నోరుజారారు. ప్రభాస్‌ని మించిన ఫాలోయింగ్ దేశంలో ఏ హీరోకు లేదని తేల్చిచెప్పారు. కానీ పక్కనే ఉన్న ప్రభాస్ మాత్రం తాను అంత గొప్పవాడినేమీ కాదని, తాను అంత పెద్ద సూపర్‌స్టార్‌ని కాదని నచ్చజెప్పాడు.
కానీ ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో భగ్గుమంటున్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్, వారి అభిమానులు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైనా తేడాలుంటే ఈ చిత్రాన్ని ఉతికి ఆరేయడానికి, ప్రభాస్‌ను తూర్పారపట్టడానికి కలాలు పదునుపెడుతున్నారు. మన గొప్పతనం గురించి మనం పొగుడుకుంటే తప్పులేదు కానీ పరాయి చోటకి వెళ్లి వాళ్లను విమర్శిస్తే అది సభ్యత కాదు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగానే ఉండాలి. అనవసరపు భజనతో ప్రభాస్‌ను టార్గెట్ చేయడానికి ఆ చిత్రం యూనిటే వారికి అవకాశం ఇచ్చిందనేది వాస్తవం.