జనసేన అధినేత పార్టీని స్థాపించి చాలా కాలమే అయినా సంస్థాగత నిర్మాణం కోసం జాప్యం చేశాడు. ఇటీవలే ఆ ప్రయత్నాలు ప్రారంభించాడు. మరోపక్క వచ్చే ఏడాది ఈ పాటి కల్లా తిరిగి ముందుగానే ఎన్నికలకు పోవాలని, ముందస్తు ఎన్నికలు మంచిదని కేంద్రంతో పాటు కొన్ని కీలక రాష్ట్రాలు కూడా ఆశపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరగక ముందే, ప్రతపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు టిఆర్‌ఎస్ వంటి పార్టీలు కూడా భావిస్తున్నాయి.
అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దమేనని ఇతర ప్రతిపక్షాలతో పాటు జనసేన కూడా స్పష్టం చేసింది. ఇక ప్రజలు ఐదేళ్లు పాలన చేయమని స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా కూడా నేటి అధికార పార్టీలు ముందస్తు ఎన్నికలకు పోవడం పట్ల విమర్శలు మొదలయ్యాయి. ఇక 2019 ఎన్నికలకు రెడీ అవుదామని చూస్తున్న జనసేనాధిపతి పవన్ ఈ ముందస్తుకు సిద్దమేనని చెప్పినా, వీటివల్ల పవన్‌కి సమయం ఎక్కువగా ఉండదని అంటున్నారు.
చేతిలో పార్టీని నడపడానికి తగినంత నిధులు లేనందువల్ల ఆయన 2019లోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాలలో నటించాలని భావించాడు. కానీ వచ్చే ఏడాదే ఎన్నికలు జరిగే పక్షంలో పవన్.. త్రివిక్రమ్‌శ్రీనివాస్ చిత్రం తర్వాత మిగిలిన సినిమాలను పక్కనపెట్టి పార్టీపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశాలు లేకపోలేదు.