ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అని యావత్ దేశం ఎదురుచూస్తోంది. కాగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ఆసక్తికర చర్చ విపరీతంగా నడుస్తోంది. ఇంతలా ఓ చిత్రంకోసం దేశ విదేశాలలోని వారు ఎదురుచూడటం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ విషయమనీ, దీనిని మరే తెలుగు చిత్రంతోనూ పోల్చలేమని పలువురు అంటున్నారు.
కానీ నాటి సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు, నేటి సూపర్‌స్టార్ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు మాత్రం ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు. గతంలో వచ్చిన తన మామయ్య సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 'సింహాసనం' తరహాలోనే 'బాహుబలి' క్రేజ్ నడుస్తోందని చెప్పాడు. కృష్ణ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం 'సింహాసనం'. కృష్ణ, జయప్రద, మందాకిని తదితరులు నటించిన 'సింహాసనం' చిత్రం మొట్ట మొదటి తెలుగులో నిర్మించిన 70 ఎం.ఎం చిత్రంగా రికార్డుల కెక్కింది. కానీ దీనిని ప్రభాస్ అభిమానులు ఖండిస్తున్నారు. 'సింహాసనం' చిత్రం కోసం కేవలం తెలుగు పరిశ్రమ మాత్రమే ఎదురుచూసిందని, కానీ 'బాహుబలి' కోసం దేశ, విదేశాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని, కాబట్టి ఈ పోలిక సరికాదని అంటున్నారు.