తమ అభిమాన హీరోలైన చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', పవన్ కళ్యాణ్‌ల 'కాటమరాయుడు'లకు బెనిఫిట్‌షోలు, ప్రీమియర్ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, ఎక్కువ షోలకు అనుమతి ఇవ్వని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు 'బాహుబలి' చిత్రానికి మాత్రం ఆయా సదుపాయాలను కల్పించడం పట్ల మెగాభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కొందరు ఫ్యాన్స్ మీరు నిజంగా మెగాభిమానులైతే 'బాహుబలి' చిత్రాన్ని మొదటి 10రోజులు చూడవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక 'బాహుబలి' షోల సందడి రేపు సాయంత్రం నుంచే మొదలుకానుంది. మరోపక్క ప్రీమియర్‌షోలు, బెనిఫిట్‌షోలకు పెద్దగా పర్మిషన్లు లభించకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెయిడ్ ప్రీమియర్‌షోలుగా వాటి పేరును మార్చి తమ షోలను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'కి పోటీగా వచ్చిన బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కీలకమైన పన్ను మినహాయింపునిచ్చిన ప్రభుత్వాలు మరోసారి సినిమాలలోకి రాజకీయాలనుజొప్పిస్తూ, తమ హీరోల చిత్రాల పట్ల వివక్షత చూపుతున్నారంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు.