ప్రపంచం దృష్టిని ఒక్క బాహుబలితో తనవైపు తిప్పుకున్న ఎస్ ఎస్ రాజమౌళి ఐదేళ్ల కఠోర శ్రమతో తెరకెక్కించిన బాహుబలి ద కంక్లూజన్ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక బాహుబలి పబ్లిసిటీని బాలీవుడ్ రేంజ్ లో చేపట్టిన రాజమౌళి అందులో భాగంగానే తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో బాహుబలికి సంబందించిన అనేక విషయాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. అందులో మచ్చుకు మీకోసం.
బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు ఎంతో ఎగ్జైట్మెంట్ ఉండేది.. సినిమా పూర్తయ్యాక విడుదలయ్యేవరకు టెన్షన్ పడాల్సి వస్తుందని అన్నారు. ఇక బాహుబలి చిత్రానికి ప్రాణం పోసింది మాత్రం అందులో ఉన్న పాత్రలే అని... ఆ కేరెక్టర్స్ ని అలా తీర్చిదిద్దిన గొప్పతనం మాత్రం తన తండ్రి విజేయేంద్ర ప్రసాద్ గారిదే అని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆ పాత్రలే కళ్ళ ముందు కదలాడుతుంటే... సినిమా చూసి ఇంటికొచ్చాక కూడా ఆ కేరెక్టర్స్ గురించి డిస్కర్స్ చేస్తే అది గొప్ప సినిమా అవుతుందని ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రికే ఇచ్చేస్తా అన్నాడు రాజమౌళి. అంతేకాకుండా నిర్మాతలు నన్ను నమ్మి ఇంత డబ్బు ఖర్చుపెట్టారు... నా కుటుంబం మొత్తం బాహుబలి కోసం శ్రమించిందని చెప్పారు. ఇక బాహుబలి ద బిగినింగ్ కి బాహుబలి కంక్లూజన్ సీక్వెల్ కాదని బాహుబలి కథ పెద్దగా ఉండడం వలన రెండు పార్టులుగా తియ్యాల్సి వచ్చిందని... మొదటి భాగంలో కథని పరిచయం చెయ్యకుండా పాత్రల పరిచయమే జరిగిందని.... ఇక ట్విస్ట్ గా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే దాన్ని పార్ట్ 2 లో చూడొచ్చని చెప్పాడు. అలాగే నాకు నేను తీసిన అన్ని చిత్రాల కంటే బాహుబలితోనే తృప్తి కలిగిందని చెప్పిన రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ విజువల్స్ పరంగా గ్రాఫిక్స్ పరంగా పెద్దదిగా కనిపిస్తుందని చెప్పాడు.
ఇక బాహుబలి చిత్రం ఎంత వసూలు చేస్తుందో చెప్పలేం కానీ ప్రీరిలీజ్ బిజినెస్,ట్రేడ్ వర్గాలను బట్టి చూస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ వసూళ్లు వస్తాయని అనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు జక్కన్న. ఇక నిర్మాతలు తమ జీవితాలను రిస్క్ లో పెట్టి మరీ బాహుబలిని నిర్మించారని వారికోసమైనా బాహుబలి భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నాని ఇంటర్వ్యూ ముగుంచాడు రాజమౌళి.