వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదు అనేది పురాతన సామెత. దీన్ని నిజం చేస్తూ పాలించేవాడు మనవాడైతే ఏదైనా సాధించుకోవచ్చు. 'బాహుబలి 2' సినిమా టికెట్ ధరలు పెరిగాయి. వారం రోజుల పాటు ఆరు ఆటల ప్రదర్శనకు అనుమతి ఇచ్చేశారు. పెరిగిన ధరలను ప్రజలు భరించాల్సిందే. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కె.రాఘవేంద్రరావు కొద్ది రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా టికెట్ ధరలను పెంచి అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'బాహుబలి' చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఆయన అల్లుడు నిర్మాత అనే విషయం తెలిసిందే.
టికెట్ ధరల పెంపు నిర్ణయం సరైంది కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ చిత్రానికి భారీ రేట్లు అనే చందాన ప్రభుత్వ నిర్ణయం ఉంది. కొందరికి లబ్ది చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం కేవలం ఐదు ఆటలకే అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ ధర పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.