కమల్ ఏమి చేసినా పర్‌ఫెక్షనిజం కనిపిస్తుంది. అది నటనైనా, దర్శకత్వమైనా ప్రాణాలు పణంగా పెడతాడు. ఆయనకు అన్ని సినిమానే. దానినే శ్వాసిస్తుంటాడు. నిజంగా ఆయన తానే నిర్మాతగా, దర్శకునిగా తీసిన 'విశ్వరూపం' వంటి సబ్జెక్ట్‌ను ఎవరూ ధైర్యం చేయలేరు. కానీ కమల్ చేసి నిరూపించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాననుకున్నది తీశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అడ్డపడినా పరిస్థితులకు తలొగ్గలేదు.
ఆస్తులు అమ్మి సినిమాను రిలీజ్ చేశాడు. ఇక 'విశ్వరూపం2'కి ఆనాడే నాంది పలికాడు. కానీ నిర్మాతగా చేతిలో పైసా లేకపోవడంతో నిర్మాణ బాధ్యతలను ఆస్కార్ రవిచంద్రన్‌కి అప్పగించాడు. ఇక ఆ నిర్మాత కూడా 'ఐ' వల్ల నష్టాలలో పడిపోయాడు. ఒకానొక సందర్భంలో కమల్ చిత్రాన్ని ఆస్కార్ ఎందుకు రిలీజ్ చేయడం లేదో? దానికి కారణాలు ఏమిటో? తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక ఆ బాధను గుండెల్లో దాచుకుని 'ఉత్తమవిలన్, పాపనాశం' చేశాడు. ఇక 'శభాష్ నాయుడు'పై మనసు పెట్టాడు.
కానీ తన 'విశ్వరూపం2' విడుదలకు నోచుకోకుండా మూలనపడకూడదని ధైర్యం చేసి ఆస్కార్ రవిచంద్రన్‌కి ఇవ్వాల్సిన మొత్తాన్ని నానా ఇబ్బందులు పడి ఇచ్చి,తిరిగి తన చిత్రాన్ని తానే తీసుకున్నాడు. ఈ చిత్రం తన కోసమే కాదు.. దేశం కోసమని సగర్వంగా స్పందించాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.