తాజాగా కీరవాణి మాట్లాడుతూ, భారతదేశంలో సొంత థియేటర్, ఖరీదైన కారులేని పెద్ద సంగీత దర్శకుడిని తానేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనది కడుపునిండిన బేరం కాదని, కేవలం కుటుంబాన్ని పోషించుకునే మొత్తమే సంపాదించానన్నాడు. తన కడుపు నిండలేదని, కానీ ఇక్కడ తన కడుపు అంటే ఆత్మసంతృప్తి అన్నాడు. తాను చేయగలిగింది వేరని.. కానీ తాను చేస్తోన్న పని వేరన్నాడు.
ఇక ఆయన వేటూరి, సిరివెన్నెలలు ఒక్క పాట రాయాల్సివచ్చినా స్టోరీ మొత్తం అడిగేవారని, కేవలం పాటల రచయిత అంటే పాటలు రాయడమే కాదు.. దర్శకులకు కొన్ని విషయాలలో దిశానిర్దేశం చేయాలన్నారు. ఆయన చెప్పిన మాట అక్షరసత్యం. కానీ నేడున్న దర్శకులేకాదు.. మీలాంటి సంగీత దర్శకుల్లో కూడా గీతరచయితలు సలహా చెబితే తీసుకునే వారు ఎంత మంది ఉన్నారో? ఆలోచించండి.
మీరు కాస్త కోప్పడినందున స్వయంగా ఏసుదాస్ వంటి వారి మీదే మీరు మండిపడ్డారు. మరి గీత రచయితలు చెబితే వినే వారెందరు? ఇక మీరు అనంత్‌శ్రీరామ్ గురించి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సందేశాత్మక గీతాలు మాత్రమే ఆయనకు వస్తున్నాయని బాధపడ్డారు. కానీ నాటి శ్రీశ్రీ, దేవులపల్లి వంటి సవ్యసాచులను కూడా సినీ దర్శకులు, సంగీత దర్శకులు ఓ రకం గీతాలు మాత్రమే రాయమని బలవంతం చేసేవారు. ఇక రాజశ్రీ నుంచి వెన్నెలకంటి నుంచి వనమాలి వరకు ఎందరినో డబ్బింగ్ చిత్రాల గేయరచయితలు కూడా చూస్తున్నారు. భాస్కరభట్లను ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. మరి దీనికి బాధ్యులు సంగీత దర్శకులు, దర్శకులు కాదా..?
ఇక మీరు జొన్నవిత్తుల గురించి కూడా ప్రస్తావించారు. ఆయన మహావిద్యాంసుడు, అష్టావధానాలు, శతావధానాలు చేసే పండితులు. ఆయన కూడా సందర్భం నచ్చకపోతే రాయరని చెప్పారు. ఇది అక్షరసత్యం. మరి అలాంటి మహాపండితునికి మీరిచ్చిన అవకాశాలు ఎన్ని.. ఏమిటి? ఇక ఏదో చేయాలని, ఏదో చేస్తున్నానన్నారు. అన్నింటిలో ప్రతిభ చూపించాలని అందరికీ వుంటుంది. దానికి మీరు చెప్పిన జొన్నవిత్తుల గారే ఉదాహరణ. రాజేంద్రప్రసాద్‌తో 'పెళ్లాం పిచ్చోడు' సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ ఏమైంది? కాబట్టి మీకు ఆల్‌రెడీ ఒక ఫ్లాట్‌ఫాం ఉంది కాబట్టి ఇకనైనా మీకు ఆత్మసంతృప్తినిచ్చే పనులే చేయండి...!