జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణం ఇప్పుడే మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ జనసేన ప్రత్యక్ష ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నిన్నటివరకు పవన్ బిజెపిని మాత్రమే విమర్శించాడు. దాంతో బిజెపి నేతలే ఆయన్ను టార్గెట్ చేశారు. ఇక వైసీపీ విషయంలో మౌనం వహించడం, టిడిపిని విమర్శించకోవడంతో వైసీపీ నుంచి దాడి మొదలైంది. ఇక తాజాగా ఆయన టిడిపిని కూడా దుయ్యబట్టడంతో వైసీపీ మౌనం పాటిస్తోంది. ఇంతకాలం పవన్ తమతోనే ఉంటాడని, ఆయన వల్ల తమకే లాభమని భావించిన టిడీపీ నాయకులు ఇప్పుడు పవన్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా టిడిపి సీనియర్ శత్రుచర్ల విజయరామరాజు జనసేనపై, పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పవన్ సినిమా మూడుగంటల పాటు చూడటానికి ఎలా ఉంటుందో.. ఆయన పార్టీ కూడ అంతేననీ, త్వరలో పవన్ దుకాణం సర్దేస్తాడని చెప్పాడు. స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయాలలకి వచ్చినప్పుడు కూడా ముఖానికి రంగేసుకున్నవాడు రాజకీయాలేమి చేస్తాడు? అనే విమర్శలు వచ్చాయి. ఇక చిరు వంటి కొందరు రాజకీయాలలో పెద్దగా రాణించలేకపోవచ్చు. కానీ పవన్ ఇప్పుడు చెబుతున్నది ఒకే మాట. తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, ప్రజాసమస్యలే తన అజెండా అని చెబుతున్నాడు. మరి రాజకీయాలలో గోడమీద పిల్లి వంటి శత్రుచర్ల కామెంట్స్‌పై జనసేన ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది...!