భాష, ప్రాంతీయాభిమానాలు ఉండవచ్చు. కానీ దీనికి కళలు, కళాకారులు, క్రీడలు వంటివి అతీతం. ఇక భారత్-పాక్ విషయంలో క్రీడలు, కళాకారుల విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. దేశం కంటే కళలు ముఖ్యం కాదనే వాదన కూడా లేకపోలేదు. మరి మన మహాత్మాగాంధీ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మొట్టమొదటి వారు మనవారు కాదు కదా...? ఇక ప్రస్తుతం సత్యరాజ్ విషయంలో ఇదే జరుగుతోంది. కన్నడిగులు సత్యరాజ్‌ను క్షమాపణ కోరారు.
దీంతో స్వయాన రాజమౌళి, ఆ తర్వాత సత్యరాజ్‌లు సైతం స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఇక తమిళనాడు దేవుడిగా కొలిచే రజనీకాంత్‌కు కర్ణాటక, మహారాష్ట్రలతో కూడా సంబంధం ఉంది. తాజాగా సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెప్పడంతో కన్నడిగులు శాంతించారో లేదో గానీ తమిళులు మండిపడుతున్నారు. తాజాగా తమిళనాడులో కన్నడ చిత్రాల ప్రదర్శనలను రద్దు చేశారు. దీంతో కన్నడ సంఘాలు కూడా బెంగుళూరులో సహా కర్ణాటక మొత్తంగా తమిళ చిత్రాల ప్రదర్శనలను ఆపివేయాలని అల్టిమేటం జారీ చేశారు.
పైకి ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే విదేశాలలో ఏమోగానీ మన దేశంలోని రాష్ట్రాల మధ్యనే చిచ్చు వస్తోంది. ఇప్పటికైనా పాలకులు, పరిశ్రమ పెద్దలు ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సివుంది.