బాలీవుడ్‌లో ఏదైనా చిత్రాన్ని ప్రారంభించిన రోజే ఆ చిత్రం విడుదల తేదీని పక్కాగా చెప్పే సంప్రదాయం ఉంది. కొన్ని సార్లు మిస్సయినా కూడా ఆ తేదీనే వారు పక్కా టార్గెట్‌గా ఎంచుకుంటారు. దాంతో మిగిలిన నిర్మాతలకు, మరీ ముఖ్యంగా చిన్నచిత్రాల వారికి రిలీజ్ డేట్ విషయంలో తమకు పెద్ద హీరోలకు పోటీ రాకుండా చూసుకునే వెసులుబాటు ఉంది. కానీ నేడు టాలీవుడ్ స్టార్ హీరోలు మిగిలిన వారిలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ రిలీజ్ డేట్స్‌ని మార్చుకుంటున్నారు.
తాజా వేసవిసీజన్‌పై మన స్టార్ హీరోలు ముందుగానే ఫోకస్ పెట్టినప్పటికీ ఒక్క పవన్ 'కాటమరాయుడు' మాత్రమే ఈ వేసవికి రిలీజ్ అయ్యాయి. మహేష్, బన్నీలు షాకిచ్చారు. చిన్నగా వేసవి వెళ్లిపోయిన తర్వాత వస్తున్నారు. నాని 'నిను కోరి' చిత్రం రిలీజ్ డేట్‌ను జూన్ 23కి పెట్టిన ఒక్కరోజులోనే అదే తేదీన బన్నీ-దిల్‌రాజుల 'డిజె' రిలీజ్ డేట్‌ను పోస్టర్స్‌తో సహా ప్రకటించారు. దీంతో ఇప్పుడు నాని కూడా ఇబ్బందులు పడుతున్నాడు. మహేష్ ఆగష్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకగా మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. నాగచైతన్య 'రా రండోయ్ వేడుక చూద్దాం', 'గౌతమ్ నందా' వంటి చిత్రాలు కూడా ఎప్పుడు తమ చిత్రాలను రిలీజ్ చేయాలో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడ్డాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.