తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా తెలుగు సినిమాల బడ్జెట్ 100కోట్లు దాటుతుండటంపై కాస్త విచారంగానే స్పందించాడు. కానీ ఆయన మాటల్లో వాస్తవం ఉంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఉంటే అది ప్రేక్షకులకు ఆనందమే. కానీ నిర్మాతలు ఖర్చుపెట్టిన డబ్బులు తెరపై కనిపించకపోతే అదీ అందరికీ బాధాకరమే. ఆర్టిస్టుల, టెక్నీషియన్స్‌ల రెమ్యూనరేషన్‌కు దాదాపు 60 శాతం వరకు ఖర్చవుతోంది.
ఇక ఇలాంటి విజువల్ వండర్స్‌ని కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లా లిమిటెడ్ బడ్జెట్‌తో, అతి తక్కువ పనిదినాలలో పూర్తి చేయవచ్చని క్రిష్ నిరూపించాడు. కానీ నేటిసోకాల్డ్ 100కోట్ల బడ్జెట్‌చిత్రాలు ఏళ్ల తరబడి తీస్తున్నారు. 50 నుంచి 100 పనిదినాల కంటే తక్కువగా తీయగలిగిన సత్తా ఉన్నప్పటికీ పనిదినాలను పెంచుతున్నారు. ఇక 100కోట్లు ఫైనాన్స్‌కి తెస్తే దాని వడ్డీ పనిదినాలు, రిలీజ్ లేటవ్వడం వల్ల 15 నుంచి 20కోట్లు అవుతుంది. మరి ఈ లెక్కన మన మేకర్స్ 100కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలుగా చెప్పుకుంటున్న వాటిల్లో సినిమా తెరపై పెట్టే ఖర్చు ఎంత? మరి ఎక్కువ పనిదినాలు వల్ల కార్మికులకు అందరికీ లాభమే కదా..! అని వాదించే వారు కూడా ఉంటారు.
మరోపక్క ఇలాంటి చిత్రాలు వస్తేనే డిస్ట్రిబ్యూటర్ల నుంచి సైకిల్ స్టాండ్, సమోసాలు అమ్మేవారు కూడా బతుకుతారని వాదించేవారు ఉన్నారు. ఇక తమ్మారెడ్డి చెప్పినట్లు ఈ 100కోట్ల బడ్జెట్‌తో 'శతమానం భవతి' వంటి చిత్రాలను 10 తీయవచ్చు. 'పెళ్లిచూపులు' వంటి చిత్రాలను 40 తీయవచ్చు. ఇవి అవార్డులనే కాదు.. రివార్డులను కూడా పొంది, తెలుగు సినిమా ప్రఖ్యాతిని పెంచిన చిత్రాలే కదా..! మరి ఈ చిత్రాల థియేటర్లలో సైకిల్‌స్టాండ్ వారి నుంచి సమోసాలు అమ్మేవారి వరకు బతకలేదా? ఇలా సినిమాల సంఖ్య పెరిగితే సినీ కార్మికులకు కూడా మంచిదే కదా..! ఇక ఇలాంటి పెద్ద చిత్రాల వల్ల ప్రేక్షకులకు కూడా భారమే.
టిక్కెట్ల రేట్లను పెంచుతారు. కానీ 'శతమనం....', 'పెళ్లిచూపులు' వంటి చిత్రాలు అసలు ధరకే ప్రేక్షకులకు ఆనందాన్ని పంచాయి. ఇక టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల సరిగా లెక్కలు నిర్మాతలకే కాదు.. ఎవ్వరికీ తెలియడం లేదు. మరి ఇదంతా బ్లాక్‌మనీగా చెలామణి అవుతోంది. మరి నల్లదనం లేకుండా చేస్తామనే మన పాలకులు ఇలా అడ్డగోలుగా టిక్కెట్ల రేట్ల పెంపును పట్టించుకోకపోగా, ప్రోత్సహిస్తే అది ఎంత తప్పు...!