ఏర్పేడులో జరిగిన ఘోరప్రమాదంపై అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. బాబు నుంచి పవన్‌కళ్యాణ్, లోకేష్‌బాబు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తుంటే షరామామూలుగానే టిడిపి న్యాయం చేస్తామని చెబుతోంది. ఇక ఈ ఘటనతో మరోసారి కొన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. లారీ డ్రైవింగ్ లైసెన్స్ లు లేని వారు భారీ వాహనాలను నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ప్రయాణికులను ఎక్కించుకోవడం, నిద్ర లేకుండా వాహనాలను నడపడం వంటివి ఎవ్వరూ పరిష్కరించలేకపోతున్నారు.
ఆ మధ్య కేంద్రం రాత్రిళ్లు లారీల ప్రయాణాన్ని మూడు నాలుగు గంటలు ఆపాలని, తద్వారా బలవంతంగానైనా డ్రైవర్లకు రెస్ట్ ఇవ్వాలని ఆలోచించింది. కానీ అది అమలుకు ఇంకా నోచుకోలేదు. అధికారులు పట్టించుకోరు. ప్రజాప్రతినిధులకు కళ్లు, చెవులు ఉండవు. ఇక పోలీస్ శాఖ, ఆర్టీఏ అధికారుల, సిబ్బంది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాగా గత కొంతకాలంగా పలు చోట్ల నాయకులు, బలం కలిగిన వారు, అధికారంలో ఉన్న నేతలు, వారి కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి ఎన్నోచోట్ల ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. పట్టించునే నాధుడే లేడు. ఎదిరించిన వారిని చంపేస్తున్నారు. ఇక ఈ ఘటన విషయంలో ప్రమాదం జరిగిన లారీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది.
పంటపోలాలోని ఇసుకను తవ్వి అక్రమంగా నాయకులు రవాణా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం దారుణం. ఇక స్థానికనేతలు, ప్రజా ప్రతినిధులు, చివరకు ఎస్సై, సీఐలు కూడా చాలా ఆలస్యంగా స్పందించారు. టోల్‌గేట్ల రూపంలో కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు పుణ్యస్థలమైన తిరుపతికి వెళ్లే బిజీ దారి అయిన నాయుడుపేట నుంచి తిరుపతి వరకు ఉన్న సింగిల్‌రోడ్లను, ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఆవేదన కలుగుతుంది. తాత్కాలికంగా బాధితులను ఆదుకోమని చెప్పడం కరెక్టే గానీ సమస్యలోతుల్లోకి వెళ్లి చర్యలు చేపట్టాలని పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.