త్వరలో జరగనున్న రాష్ట్రపతి పోటీలో బిజెపి నుంచి సీనియర్ నాయకులైన ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్‌జోషీల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇక మోదీ, అద్వానీని రాష్ట్రపతిని చేసి ఆయన రుణం తీర్చుకుంటానన్నాడు. కానీ మోదీ అంతరంగం బాగా చదివిన అద్వాణీ మాత్రం పొంగిపోకుండా, తనకు ప్రజల్లో ఉండటమే ముఖ్యమని తేల్చాడు. ఇక న్యాయవ్యవస్థ అనేది, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ వంటివి స్వతంత్య్ర సంస్థలే అయినా కూడా వీటిపై ప్రభుత్వాల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయాలు, ప్రభావాలు ఉంటాయనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.
కాగా ఉన్నట్లుండి బాబ్రీ మసీదు కేసు కోర్టులో విచారణకు రావడం, అది కూడా రాష్ట్రపతి ఎన్నికల ముందే ఈ చర్యలు తీసుకోవడం పట్ల బిజెపిలోనే కాదు.... విహెచ్‌పీ, భజరంగ్‌దల్, మరీ ముఖ్యంగా ఆరెస్సెస్, శివసేన వారిలో కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వినయ్‌కతియార్ నుంచి చివరకు మాజీ బీహార్‌ముఖ్యమంత్రి లల్లూప్రసాద్ యాదవ్ వరకు ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక యాధృచ్చికమో.. కాకతాళీయమో.. కాదని ఉద్దేశ్యపూర్వకంగా ముందు చూపుతో జరిగిన చర్యగా కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ దీనిపై మోదీ అండ్ కో మాత్రం చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయనే పివినరసింహారావు ప్రకటనను మాత్రమే వల్లెవేస్తారు.