తాజాగా కేంద్రం ప్రధాని, రాష్ట్రపతులతో సహా.. ఎవ్వరి వాహనాలకు ఎర్రబల్బులు, నీలి బలుబులు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం నిజంగా ప్రశంసించదగిందే. నేడు ప్రధానులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్లు, కేంద్రమంత్రుల నుంచి సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, చివరకు కార్పొరేటర్లు కూడా ఎర్రబుగ్గ వాహనాలతో తమ దర్జా, దర్పం చూపిస్తున్నారు. పోలీసుల చేత నానా హడావుడి చేయించి, సామాన్యులను, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. తమ రాజకీయ దర్పానికి బుగ్గవాహనంలో తిరగడం వంటి చేష్టలతో మితిమీరిపోతున్నారు. కేవలం పోలీస్ వాహనాలకు, అంబులెన్స్‌లకు మాత్రమే దీనిని పరిమితం చేయడం అభినందనీయం.
ఇక కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వాహనాలలో వారు లేనప్పుడు కూడా వారి అనుచరులు బుగ్గవాహనాలలో ఎస్కార్ట్‌లు, కాన్వాయ్‌లతో రెచ్చిపోతున్నారు. ఇక పెద్దల సుపుత్రుల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మద్యం సేవించి మరీ ఎస్కార్ట్‌లతో వెళ్తున్నారు. పోలీసు శాఖ, ట్రాఫిక్ యంత్రాంగం అసలు వారి కంటే ఓవర్‌యాక్షన్ చేస్తున్నారు. చాలా ఏళ్ల కిందట ఓ బాలీవుడ్ హీరో తన షూటింగ్‌కు సమయం అవుతుంటే.. ట్రాఫిక్ వల్ల ఆలస్యమవుతుందని భావించి, ఓ అంబులెన్స్‌ని, దాని హారన్‌లు ఉపయోగించుకుని పట్టుబడ్డాడు. కానీ ఆయనపై చర్యలు ఏమీ లేవు. మీడియాలో రెండుమూడు రోజుల హంగామా జరిగింది అంతే...!
ఇక కొన్నిరాష్ట్రాల న్యాయమూర్తులు కూడా బుగ్గకారులు వాడమని స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయం. ఇక వీటి వల్ల, కాన్వాయ్‌ల వల్ల ప్రజాధనం కూడా వృధా అవుతోంది. మరి దీనిని మోదీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందో.. కడదాకా ఇదే మాట మీద నిలబడుతుందో.. లేదా ఓ ప్రచారంగా, ప్రజల నోళ్లలో నానేందుకే పరమితమై 'లైట్' తీసుకుంటుందో.. వేచిచూడాల్సివుంది....!