నోట్ల రద్దు మంచి చర్యే అయినా... ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, గాలిజనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు బిజెపి నాయకులు తమ పిల్లల వివాహాలను నోట్ల రద్దు సమయంలో కూడా కోట్లు వెదజల్లి చేయడం... కొందరి ఇళ్లలో ఇప్పటికీ కొత్తనోట్లు, పాతనోట్లు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటం, సామాన్యులకు మాత్రం బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు ఇప్పటికీ లభ్యం కాకపోవడం... ఇప్పటివరకు ఎంత నల్లదనం బయటకు వచ్చిందో కూడా నిజాయితీగా బయటపెట్టకపోవడం వల్ల ఈ నోట్లరద్దు వల్ల సామాన్యులే ఇబ్బందులు పడ్డారనేది వాస్తవం.
ఇప్పటికీ సామాన్యులను ఎన్నో షరత్తులు, నియమాలతో నియంత్రిస్తున్న మోదీ సర్కార్ కొన్ని విషయాలలో మాత్రం తేలిపోతోంది. ఇక రాజకీయపార్టీల విరాళాలను కూడా బయటకు తీస్తామని చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో ఒక్క ధనవంతుడు, చివరకు కార్పొరేటర్ కూడా బ్యాంకుల్లో, ఏటీఎంల క్యూలలో నిలబడలేదు. కానీ సామాన్యులు తమ పిల్లల పెళ్లిళ్లకు ఖర్చుపెట్టిన లెక్కలు అడుగుతున్నారు.
ఇక ప్రతి ఏటా లేదా రెండేళ్లకు ఒకసారి కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్ వంటి పార్టీలు, చిన్నాచితకా రాజకీయపార్టీలు కూడా ప్లీనరీల పేరుతో, వ్యవస్థాపకదినోత్సవాలు పేరుతో, మహానాడుల పేరుతో కొట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నాయి. ఇక తాజాగా టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో 25 రకాల నాన్‌వెజ్, వెజ్ వంటకాలతో ఆర్బాటం చేసి, విందుభోజనాలు కూడా పెట్టారు. మరి వీటన్నింటికి లెక్కలు ఎక్కడ నుంచి అడుగుతావు? వారి వద్ద ఇంత ఆర్ధిక గడ్డు పరిస్థితుల్లో కూడా ఇలా కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోదీ ఇదంతా మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా...?