'అష్టాచమ్మా' తో నేచురల్ స్టార్ గా పేరు కొట్టేసిన నాని అనతికాలంలోనే హీరోగా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. అతనేం కేరెక్టర్ చేసినా అందులో జీవించేస్తాడు. అందుకే అతను చేసిన చిత్రాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. అయితే నాని మాస్ ని నమ్ముకుని చేసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మాస్ చిత్రాలతో కలిసి రానప్పటికీ తనకు నప్పే కథలను ఎంచుకుంటూ వరస హిట్స్ తో మంచి జోరును ప్రదర్శిస్తున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న నాని కి తాజాగా మరో మూడు సినిమాలు చేతులో ఉండడంతో యమా బిజీగా వున్నాడు.
'నేను లోకల్' చిత్రం విజయంతో జోష్ లో నాని, దిల్ రాజు నిర్మాణంలో ‘ఎంసిఏ’ అనే మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉండగా... కొత్త డైరెక్టర్ శివ డైరక్షన్ లో 'నిన్ను కోరి' అనే చిత్రం ప్రస్తుతానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తర్వాత నాని మరోమారు హను రాఘవపూడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇదివరకే నాని, హను రాఘవపూడి డైరెక్షన్ లో 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంలో నటించాడు. ఆ చిత్రం మంచి హిట్ అవడంతో హను రాఘవపూడికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. అప్పట్లో ఫేమస్ అయిన 'అన్నమయ్య' చిత్రంలోని 'అదిగో అల్లదిగో...' సాంగ్ లోని మొదటి పల్లవితో టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. అంటే హను రాఘవపూడి - నాని చిత్రానికి టైటిల్ 'అదిగో అల్లదిగో' అని ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ లో నాని ఉన్నట్లు ఏ స్టార్ హీరో కూడా బిజీగా లేడు. ఇలా నాని రోజు రోజుకి తన క్రేజ్ ని పెంచుకుంటూ మంచి గుర్తింపు పొందుతూ నిర్మాతలకు బెస్ట్ ఛాయస్ గా నిలుస్తున్నాడు.