దేశంకి స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లవుతోంది. మన తర్వాత స్వాతంత్య్రం సంపాదించిన దేశాలతో పాటు హీరోషిమా, నాగసాకితో దెబ్బతిన్న జపాన్ సైతం అభివృద్దిపధంలో దూసుకెళ్తున్నాయి. ఇక మన దేశంలో ఇప్పటికీ కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు, గ్రామీణాభివృద్దికి అంత కేటాయించాం.. రైతుల కోసం ఇంతకేటాయించాం.. రుణమాఫీలకు మేమే ఎక్కువిచ్చాం... దళితుల అభివృద్ది, మైనార్టీలకు మేమే ఎక్కువిచ్చాం.. మౌళిక సదుపాయాలకు ఇంత కేటాయించాం.. యువతకు ఉపాధి చూపించాం.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం.. పోలవరానికి, అమరావతి రాజధానికి ఇంత మొత్తం ఇచ్చాం.. బిసి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు, వారి కార్పొరేషన్లకు ఎంత మొత్తం ఇచ్చింది... అనే విషయంలో మన రాజకీయ నాయకులు, పార్టీలు అంకెల గారడీలు చేస్తూ వస్తున్నాయి. వీటిలో అధికభాగం మొత్తాలకు లెక్కలు కూడా ఉండవు.
మరి ప్రతి బడ్జెట్‌లోనూ చెబుతున్న ఈ లక్షల కోట్లు ఏమవుతున్నాయి? ఒక రంగంలోనైనా మనం అభివృద్ది సాదించామా? ఒక అంతరిక్షయానంలో మాత్రమే అదీ మన శాస్త్రవేత్తల శ్రమతోనే మనం ముందున్నాం. చివరకు దేశభద్రతకు సంబంధించిన రక్షణ రంగంలో కూడా ఎన్నో కుంభకోణాలు. దీంతో ఈ అంకెల గారడీలు, ప్రత్యేక కార్పొరేషన్లు, స్వయంసమృద్ది అనే వన్నీ నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉన్నాయి.
కాబట్టి కేంద్రం ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీపై ప్రజల్లో నమ్మకాలు లేవు. సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వీరు ఎన్ని చెప్పినా.. ప్రత్యేకహొదాకు అవి సమానం కాదు. ఈ అంకెలపై ప్రజలకు విశ్వాసం లేదు. ఈ ప్యాకేజీలన్నీ నాయకుల, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కానీ ప్రజలను ఉద్దరించడానికి కాదు. జలయజ్ఞాలు, గ్రాఫిక్స్ రాజధానిలపై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది..!