బుల్లితెర మీద రారాణిలా ఒక వెలుగు వెలుగుతున్న అనసూయ వెండితెర మీద కూడా వెలిగిపోదామని ప్రయత్నిస్తూనే వుంది. ఇద్దరి పిల్లలకు తల్లైనా కూడా గ్లామర్ విషయంలో టాప్ హీరోయిన్స్ కి సైతం గట్టిపోటీ ఇచ్చే స్థాయికి వచ్చేసింది. అందుకే సినిమాల్లో హీరోయిన్ పాత్రల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు ఆ పాత్రలు రాకపోయేసరికి తనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ అటు బుల్లితెర మీద ఇటు వెండితెర మీద తన టాలెంట్ చూపించేస్తుంది ఈ భామ. మొన్నామధ్యన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో సుయ... సుయ.. అంటూ స్పెషల్ సాంగ్లో ఆడిపాడిన అనసూయ ఇపుడు మరో మెగా హీరో రామ్ చరణ్ చిత్రంలో ఒక ఛాన్స్ కొట్టేసింది.
సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో అనసూయ ఒక ఫుల్ లెన్త్ రోల్ లో మెరవనుంది. అయితే అనసూయ ఈ చిత్రంలో ఏదన్న గెస్ట్ రోలో లేకపోతె ఒక స్పెషల్ సాంగ్ లాంటిదేమన్న దానిలో నటిస్తుందని ప్రచారం జరుగుతున్న వేళ అనసూయ పాత్రపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. సుకుమార్ మూవీలో అనసూయ, రామ్ చరణ్ కి మరదలి క్యారెక్టర్ చేస్తుందని సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే అనసూయ సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జునకి మరదలిగా కొన్ని నిముషాలు కనబడి మురిపించింది. మరి ఇప్పుడేమో రామ్ చరణ్ కి మరదలిగా సినిమా ఆద్యంతం కూడా మెప్పించడానికి రెడీ అయ్యిందన్నమాట.
ఇక ఈ చిత్రం ఒక పల్లెటూరి ప్రేమ కథ చిత్రంగా ఉంటుందని ఇందులో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక సమంత మొదటిసారిగా రామ్ చరణ్ కి జోడిగా ఈ చిత్రంలో నటిస్తుంది.