రాజ్యసభకు ఎంపీ కావడం, ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడంలో తప్పులేదు. ఇక అలా ఎన్నికైన వారు మంత్రులు, ప్రధానులు కాకూడదని కూడా ఎక్కడా లేదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోనే ఆ వెసులుబాటు ఉంది. అయితే పెద్దల సభకు ఎవరిని పంపాలి? దానికి కావాల్సిన అర్హతేమిటి? అనే విషయంలో మాత్రం పలు సందేహాలున్నాయి. ఏదైనా రంగంలో నిష్ణాతులను ఎన్నికల్లో గెలవకపోయిన కూడా దేశసేవకు ఉపయోగించుకునేందుకే పెద్దల సభలున్నాయి.
కానీ నేడు ఆ పరిస్థితి కనపడటం లేదు. రాజకీయాలలో విలువలు తగ్గుతున్న నేపథ్యంలో రాజ్యసభలు, శాసనమండలిలు రాజకీయ నిరుద్యోగులకు నిలయంగా మారుతున్నాయి. ఇక శాసనమండలిలు ఉండాలా? లేదా? అవి అదనపు భారం అవుతాయని భావిస్తే వాటిని రద్దు చేసే అవకాశం కూడా రాజ్యాంగం రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది. దీంతో శాసనమండలి అప్రదిష్టపాలవుతోందని భావించిన నాటి సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ దానిని రద్దు చేశారు. కానీ వైఎస్ హయాంలో అది మరలా పురుడుపోసుకుంది.
ఎన్టీఆర్ సిద్దాంతాలే మా సిద్దాంతాలని చెప్పుకునే చంద్రబాబు ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలిని కొనసాగిస్తున్నారు. ఇక కేంద్రంలో వెంకయ్యనాయుడు కీలక మంత్రిగా పనిచేస్తున్నా కూడా ఆయన రాజ్యసభ సభ్యుడే గానీ ప్రత్యక్ష ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తికాదు. ఇక చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశాడు. ఇక తాజాగా ఎమ్మెల్సీ, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ వింత వాదన చేశాడు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి కావడం తప్పుకాదని, నారాయణ మంత్రిగా, నారా లోకేష్‌లు కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులు కావడం తప్పులేదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, గతంలో మన్మోహన్‌సింగ్ రాజ్యసభకు ఎన్నికై ప్రధానిగా కూడా చేశాడని సెలవిచ్చాడు.
అబ్బో.. సోమిరెడ్డికి చాలా విషయాలు తెలుసే. మన్మోహన్‌సింగ్ ప్రపంచ మేధావి. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త. ఆయన రాజకీయాలలోకి రావడం ఆయనకు కూడా ఇష్టం లేదు. కానీ దేశం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాటి మేధావి, నవభారత నిర్మాణ కర్త పివినరసింహారావు బలవంతంగా ఆయన్ను ఒప్పించి రాజ్యసభకు పంపి ఆర్ధిక మంత్రిని చేసి దేశ గతిని మార్చే విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. ఇక తాను ప్రధాని అయ్యే అవకాశం పెద్దగా లేకపోవడం, కింగ్‌గా కన్నా కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పాలని, తానే విదేశీ వనితకు కాబట్టి ప్రదానిని అయితే దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించిన సోనియా మన్మోహన్‌సింగ్‌ని అడ్డుపెట్టుకుని ఆయన్ను ప్రధానిని చేసింది.
కానీ ఆయన చాలా విషయాలలో సోనియా మాటలకు కూదా ఎదురుచెప్పి నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా, రాహుల్, రాబర్ట్‌వాద్రా, కనిమోళి, రాజా, దాసరి వంటి వారు అక్రమ సంపాదన చేశారు. కానీ మన్మోమన్ మాత్రం క్లీన్‌పర్సన్. ఇక చిరంజీవి, వెంకయ్య వంటి వారి గురించి మాట్లాడుకోవడం అనవసరం. సినీ నిష్ణాతునిగా చిరుకి రాజ్యసభకుపంపి, కేంద్రమంత్రిగా చేస్తే ఆయన తనకున్న సినీ అనుభవంతో సినీ రంగానికి ఏమైనా మేలు చేశాడా? తన గళం విప్పాడా? ఇక నారాలోకేష్, మంత్రి నారాయణ, సోమిరెడ్డిలు దేనిలో నిష్ణాతుల్లో సోమిరెడ్డి చెప్పగలరా...?