దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అనిత మరణించినప్పుడు దిల్ రాజు అమెరికా లో వున్నాడు. ఆమె మరణ వార్త విన్న దిల్ రాజు హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదిగో అప్పటినుండి ఇప్పటివరకు దిల్ రాజు తన భార్య మరణం గురించి వేదన మనసులోనే దాచుకుని బాధ పడుతున్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. అనిత మరణం తనకి తీరని లోటని... ఆమె మరణించినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అనిత మరణం గురించి అల్లుడు నాకు ఫోన్ చేసి చెప్పగానే ఎంతో వేదనతో ఫ్లైట్ ఎక్కాను... అమెరికా నుండి హైదరాబాద్ చేరుకోవడానికి దాదాపు 27 గంటల సమయం పట్టింది. ఆ 27 గంటల సమయం నాకు నరకంతో సమానంగా తోచింది. అసలు ఆ 27 గంటలు నాకు కంటిమీద కునుకులేదని చెబుతున్నాడు.
ఇక ఫ్లైట్ ఎక్కేముందు హరీష్ శంకర్ ఫోన్ చేసి పాప ని అంత బాధలో చూడలేకపోతున్నామని... త్వరగా రమ్మని చెప్పాక నా వేదన మరింత ఎక్కువైంది. ఇక ఫ్లైట్ లో ఫోన్ కాల్స్ కట్ అయ్యాక వాట్స్ అప్ తోనే గడిపానని కన్నీళ్ల పర్యంతమయ్యాడు దిల్ రాజు. ఇక ఇంటికి రాగానే మా పాప నాకు ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకెళ్లి నాకు అండగా నిలిచిందని చెప్పాడు. ఇక అనిత పోయాక డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేసినా, భోజనం చేసినా ఆమే గుర్తొస్తుందని... నాకు అన్నీ కొసరి కొసరి వడ్డించేదని బాధగా చెబుతున్నాడు. అనిత లేని లోటు ఎప్పటికి తీరదని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నాడు దిల్ రాజు.