తాజాగా రామ్‌చరణ్ తన రూటును మార్చి 'ధృవ'తో పాటు సుకుమార్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో చరణ్ ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడని, చెవిటి వాడి పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల చరణ్ లుక్ ఒకటి సోషల్‌మీడియాలో లీకైంది. అందులో గుబురు గడ్డం పెంచుకుని, లుంగీ, బనియన్‌తో అదరగొట్టాడు. ఆయన అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ లుక్ చూసి షాకయ్యారు. సాధారణంగా ఇలాంటి గెటప్‌లను తమిళ హీరోలు ఎక్కువగా చేస్తారు.
'శివపుత్రుడు'లాంటి చిత్రంతో పాటు తమిళ, మలయాళ హీరోలకు, ప్రేక్షకులకు ఇది మామూలే అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది కొత్తే. తాజాగా సోషల్‌మీడియాలో చరణ్ లుక్ మరోటి విడుదలైంది. ఇది చూస్తే ఇంకా షాకింగ్‌గా ఉంది. ఊరమాస్ లుక్‌లో చాలా డిఫరెంట్‌గా చెర్రీ కనిపిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక 1980నాటి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోదావరి జిల్లాలలో జరుగుతోంది....!