విజయవాడ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని నెహ్రూ ఈ రోజు సోమవారం ఉదయం 5 .20 నిమిషాలకు అనారోగ్య కారణాలతో కన్ను మూసారు. కొన్ని రోజుల ముందునుంచి హైద్రాబాద్లోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అయన మూడు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. ఈ రోజు ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. నెహ్రూ కి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఈ మధ్యనే నెహ్రూ కాంగ్రెస్ నుండి టిడిపి పార్టీలోకి వెళ్లారు.
ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేసిన నెహ్రూ, ఎన్టీఆర్ మరణానంతరం కొన్ని రోజులు ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతితో నడిచారు. అయితే ఆయనకు చంద్రబాబు కి వచ్చిన మనస్పర్ధలతో నెహ్రూ కాంగ్రెస్ లో జేరారు. ఇక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా నెహ్రూ కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసినప్పటికీ ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఎంతమంది నేతలు పార్టీలు మారినప్పటికీ నెహ్రూ మొన్నీమధ్య వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. అయితే కాంగ్రెస్ లో ఉంటె తనకి, తన కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నెహ్రూ తన కొడుకు అఖిలేష్ తో పాటు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలోకి చేరారు.
కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, తూర్పు నియోజక వర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక నెహ్రూ మరణ వార్త విన్న టిడిపి నేతలు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు నెహ్రూ కుటుంబ సభ్యులకి తమ సంతాపం తెలియజేసారు. ఇక నెహ్రూ భౌతిక కాయం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించి ప్రజల సందర్శనార్ధం ఆయన్ని రేపటి వరకు విజయవాడ లోని అయన స్వగృహంలోనే ఉంచుతారు. తదుపరి రేపు మధ్యాన్నం విజయవాడలో నెహ్రూ అంత్యక్రియలు నిర్వహిస్తారని సన్నిహితులు తెలిపారు.