కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలవుతాయి... ఓడలు బండ్లవుతాయి. ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. రవితేజతో ఓ చిన్న చిత్రం ద్వారా పరిచయమై 'ఆనందం'తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన కెరీర్ 'ఢీ' నుంచి మారిపోయింది. అప్పటి వరకు దగ్గరకు రానివ్వని దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. వాస్తవానికి 'ఢీ' చిత్రానికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి.
కానీ నిర్మాత మల్లిడి ఎంతో తెగువ చేయడంతో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇక శ్రీనువైట్ల బకరా ఫార్ములాతో ఓ ఊపు ఊపాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల నుంచి మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, రామ్‌ల వరకు అందరికీ హిట్లిచ్చాడు. కానీ కోనవెంకట్‌తో ఆయన విడిపోయిన తర్వాత ఇటు శ్రీనువైట్ల, కోన ఇద్దరు దెబ్బతిన్నారు. గతంలో విడిపోయి నాశనం అయిన ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి. విజయ్‌భాస్కర్-త్రివిక్రమ్‌లే తాజా ఉదాహరణ.
తివిక్రమ్ హిట్టయినా, విజయభాస్కర్ కోలుకోలేకపోయాడు. ఇక తాజాగా శ్రీనువైట్ల భవిష్యత్తు ఏంటి? 'ఆగడు, బ్రూస్‌లీ' ల తర్వాత మరో రొటీన్ సబ్జెక్ట్‌తో వరుణ్‌తేజ్‌తో చిత్రం చేసి 'మిస్టర్' ఫ్లాప్ తర్వాత శ్రీనువైట్లకు ఎవరు? ఎప్పుడు అవకాశం ఇస్తారు? అనేది చూడాలి. కాగా ఆయన తాజాగా తానే నిర్మాతగా, దర్శకునిగా కొత్తవారితో చిత్రం ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.