గత ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమికి మద్దతు పలికి ప్రచారం కూడా చేశాడు జనసేనాని పవన్‌కళ్యాణ్. ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో సభలలో, ట్వీట్లలో బిజెపిని ఉతికి ఆరేస్తున్నాడు. ఇక తెలుగు గొంతుతో పాటు దక్షిణాది గళం ఎంచుకుని పావులు కదుపుతున్నాడు. కానీ ఆయన ఇంతకాలం టిడిపిని, చంద్రబాబును పెద్దగా టార్గెట్ చేయలేదు. వైసీపీ, జగన్ విషయంలో కూడా మౌనంగానే ఉన్నాడు. కానీ తాజాగా ఆయన ప్రత్యేకహోదా బిల్లుపై పార్లమెంట్‌లో సభకు గౌర్హాజరైన టిడిపి ఎంపీలను, మౌనంగా ఉన్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును విమర్శించాడు. మరోపక్క వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా కోసం బాగా పోరాడారని చెప్పారు.
ఈ హఠాత్పరిణామం కొందరికి షాక్‌ని కలిగించింది. ఇంతకాలం పవన్‌ను టిడిపికి, చంద్రబాబుకి కోవర్ట్ అని విమర్శించిన వారికి ఇది అర్ధంకాని పరిణామమే. ఈ ప్రకటనతో టిడిపి, వైసీపీ రెండు షాకయ్యాయి. ఇక పవన్ త్వరలో టిడిపి, చంద్రబాబులపై స్వరం పెంచనున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్డీయే భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు.. మోదీని కీర్తించి, 2019లో కూడా మోదీ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామని చెప్పాడు. సో... పవన్ వ్యతిరేకిస్తున్న బిజెపితో జత కడతామని చెప్పాడు.
దీంతో పవన్ వామపక్షాలతో పాటు ఎవరిని ముందుకు కలుపుకుని వెళ్తాడు? వామపక్షాలతో మాత్రమే కలిసి పోటీకి దిగుతాడా? అనేది వేచిచూడాలి. మరోవైపు నుంచి చూస్తే ఎవరు మంచి పని చేసినా తాను సమర్థిస్తానని మాత్రం పవన్ వైసీపి ఎంపీలను పొగడటం ద్వారా చేతల్లో చూపించాడు...!