ఉన్నత పదవుల్లో ఉండే వారికి భాషాజ్ఞానంతో పాటు కనీసం అన్నింటిపై కొద్దిపాటి అవగాహన ఉండాలి. అందరూ సర్వజ్ఞులు కాలేరు కానీ కనీసం హోంవర్క్ చేయకపోతే... ప్రజల ముందు.. ఇతరుల ముందు పరువు పోగొట్టు కోవాల్సివస్తుంది. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రిగా పదవీ స్వీకారోత్సవాలు జరిగిన రోజునే నారా లోకేష్‌బాబు తెలుగు పాండిత్యం అందరికీ అర్ధమైంది. ఇక గత ఎన్నికల సందర్భంగా ఓ సభలో నారా లోకేష్‌బాబు మాట్లాడుతూ, సైకిల్‌కి కాకుండా వేరే గుర్తుకు ఓటు వేస్తే ఉరి వేసుకున్నట్లే.. అని చెప్పాలని భావించి, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్లే అని వ్యాఖ్యానించాడు.
ఇక తాజాగా అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన అంబేడ్కర్ వర్ధంతి శుభాకాంక్షలు తెలిపాడు. జయంతిని వర్దంతిగా తప్పుగా అనుకున్నాడేమో అని వదిలేద్దాం.. కానీ వర్థంతి రోజున ఎవరైనా శుభాకాంక్షలు తెలుపుతారా? అందరూ గొప్ప వక్తలు కాలేకపోవచ్చు గానీ ఆ దిశగా ప్రయత్నాలైనా చేయాలి. మరి తెలుగువారి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడి నడుపుతున్న తెలుగుదేశం పార్టీలో ఈ భాషాదారిద్య్రం ఏమిటో అర్ధం కాని విషయం...!