సమయం సందర్భం లేకుండా ట్వీట్స్ చేస్తూ జనాన్ని తెగ విసిగించే రామ్ గోపాల్ వర్మకి చుక్కలు చూపించడానికి వంగవీటి రాధా సన్నద్ధమవుతున్నాడు. ఎప్పుడూ ట్వీట్స్ తో విసిగెత్తించే వర్మపై రాధా క్రిమినల్ కేసు పెట్టాడు. వర్మ ఎంతో ఇష్టపడి తెరకెక్కించిన 'వంగవీటి' చిత్రంలో తమ తల్లితండ్రులను అప్రదిష్టపాలు చేసే విధంగా పాత్రలను సృష్టించి సినిమా తీశాడని రాధ వర్మపై కేసు పెట్టాడు. తమ కుటుంబం పరువు వంగవీటి చిత్రంతో పోయిందని... తన తండ్రిని ఒక రౌడీలా చూపించి తన పరువు అప్రదిష్ట పాలు చేశాడని వంగవీటి రాధా పిటీషన్ లో పేర్కొన్నాడు.
అసలు 'వంగవీటి' చిత్రం మొదలు పెట్టకముందు వర్మ తమని కలిశాడని.. మా కుటుంబానికి మచ్చ రాకుండా సినిమా తీస్తానని చెప్పి.. మేము వ్యక్తం చేసిన అనుమానాలను వర్మ ఏమి పట్టించుకోకుండా సినిమా తీసి రిలీజ్ చేశాడని ఆయన పిటీషన్ లో పేర్కొన్నాడు. ఆ సినిమా విడుదలచేసేటప్పుడు మేం అభ్యంతరం వ్యక్తం చేసినా వర్మ పట్టించుకోకుండా 'వంగవీటి' చిత్రాన్ని ఇష్టానుసారంగా విడుదల చేశాడని రాధా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు వంగవీటి జీవిత కథను సినిమా తియ్యకుండా వేరేవారి కోసమో వర్మ ఈ సినిమా తీశాడని... ఆ సినిమా వాళ్ళకి ఫెవర్ గా ఉండబట్టే అవతలివాళ్ళు కిమ్మనకుండా ఉండిపోయారని ఎద్దేవా చేశాడు.
ఈ విషయం ఇంతటితో వదలమని తమకి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పాడు. మరి వర్మ మీద కేసు పెట్టిన రాధా తర్వాత ఏం చేయనున్నాడా అని బెజవాడ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క రామ్ గోపాల్ వర్మ, రాధ పెట్టిన కేసుపై ఏ విధంగా స్పదింస్తాడో అని కూడా ఎదురు చూస్తున్నారు. చూద్దాం మళ్లీ వర్మ ట్వీట్స్ యుద్ధం మొదలు పెడతాడా? లేదా అనేది.