తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఈనాడు చానెల్స్‌పై చేసిన వ్యాఖ్యలతో కూడిన ఆర్టికల్‌లో ఓ మిత్రుడు మంచి ప్రశ్నవేశాడు. బూతుల గురించి విరుచుకుపడే తమ్మారెడ్డి 'బాబు బాగా బిజీ' వంటి బూతు చిత్రాల ప్రమోషన్ చేయడం గురించి ఆ ప్రశ్న నిజంగా ఆలోచనాత్మకం. ఒక్క తమ్మారెడ్డి అనే కాదు.. ఖాళీగా ఉన్న దర్శకదిగ్గజాలు, దర్శకరత్నలు... ఇలా ఎందరో ఉన్నారు. వీరిని ఎవరైనా ఆహ్వానిస్తే వాటికి వస్తారు. అందులో తప్పులేదు. అంత పెద్ద వారిని పిలవడం,... వారు రావడం కూడా అభినందనీయం.
కానీ వారు మైకు దొరికితే చాలు రెచ్చిపోతారు. డబ్బింగ్ చిత్రం వేడుకకి వస్తే డబ్బింగ్‌చిత్రాల పోటీ వల్ల మన చిత్రాల క్వాలటీ పెరుగుందంటారు. ఓ పెద్ద స్టార్ చిత్రం వేడుకకి వెళితే ఆయాస్టార్స్‌ని సినిమా ఇండస్ట్రీకి మూలస్తంభాలని పొగుడుతారు. వారి వల్ల సినీ తల్లి జీవితం ధన్యమైందంటారు. అదే ఓ చిన్న చిత్రం ఫంక్షన్‌కి వస్తే చిన్న చిత్రాలే నిజమైనవని, అవే కార్మికులకి ఉపాధి కల్పిస్తున్నాయంటారు. ఒక దర్శకుడు పిలవడంతో ఏదైనా ఫంక్షన్‌కి వస్తే దర్శకుడే నిజమైన హీరో అని, దర్శకులు స్టార్స్‌ని తయారు చేస్తారే గానీ.. ఎంత మంది స్టార్స్ అయినా ఓ స్టార్ దర్శకుడిని తయారు చేయలేరంటారు.
ఓ భక్తిరస చిత్రం, లేదా కుటుంబకథా చిత్రం గురించి చెబుతూ, హింస, శృంగారం, అశ్లీలతలను తప్పుపడతారు. ఓ బూతు చిత్రం వేడుకకి వచ్చి నవరసాల్లో కూడా శృంగారం ఉందని చెబుతారు. ఆ చిత్రంలో అశ్లీలం లేదని కేవలం శృంగారం మాత్రమే ఉందని సర్టిఫికేట్ ఇస్తారు. వారి మాట మీద విలువతో ఆ చిత్రానికి వెళితే అందులో నీలిచిత్రాల కంటే నీచమైన సీన్స్ ఉంటాయి. వారు చెప్పేవన్నీ వాస్తవాలే అయినా ఏ ఎండకా గొడుగు పట్టడం మాత్రం తప్పు....!