తమిళనాడు రాజకీయాలు జయలలిత మరణం తర్వాత ఆసక్తి కరంగా మారాయి. ఒక పక్క తమిళ పాలిటిక్స్ వేడెక్కుతుంటే మరోపక్క సినిమా ఇండస్ట్రీలో సినిమా రాజకీయాలు అంతే హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాట విశాల్ వర్గం, శరత్ కుమార్ వర్గం పోటాపోటీగా నడిగర్ సంఘ ఎన్నికల్లో ఢీ కొట్టాయి. అక్కడ శరత్ కుమార్ చేసిన కొన్ని అవినీతి పనుల వల్ల విశాల్ వర్గం విజయకేతనం ఎగురవేసింది. అదిగో అప్పటి నుండి రాధికా కి.. శరత్ కుమార్ కి ఎదురు గాడి వెయ్యడం మొదలు పెట్టింది.
శరత్ కుమార్ అక్కడ ఓడిపోయినా తర్వాత తమిళ రాజకీయాల్లో జయలలిత చనిపోయాక శశికళ వర్గానికి మద్దతునిచ్చి... ఇప్పుడు జరిగే ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ కి మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తున్నాడు. ఇక శరత్ కుమార్, దినకరన్ లు తమిళులకు డబ్బులు పంచి పెట్టి గెలవాలని చూస్తున్నారనే ఆరోపణలతో ఈసీ అక్కడ ఉపఎన్నికను వాయిదా వేసింది. ఎన్నిక వాయిదా పడడమే తరువాయి శరత్ కుమార్ మీద ఐటి దాడులు మొదలయ్యాయి. ఇక శరత్ కుమార్ కారులో కొంత డబ్బు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్కడితో కథ ముగించకుండా ఇప్పుడు శరత్ కుమార్ భార్య రాధికా శరత్ కుమార్ కార్యాలయాలపై కూడా ఐటి శాఖ కొరడా జుళిపించింది. రాధికా శరత్ కుమార్ సొంతమైన రాడాన్ మీడియా లో ఐటి శాఖ సోదాలు నిర్వహించింది. మరి భర్త తప్పుకు భార్య కూడా బాధ్యత వహించాలి కదా.. అన్న చందంతో ఐటి శాఖ రాధికకు సంబందించిన కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో విలువైన డాక్యుమెంట్స్ ని ఐటి శాఖ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే ఇదంతా చూస్తున్న రాధికా మాత్రం... ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర అని... తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్నానని... అలాంటి తన మీద ప్రతీకార చర్యలేంటని వాపోతుంది. పాపం రాధికా... శరత్ కుమార్ లకు అటు తమిళ ఇండస్ట్రీలోనే కాక ఇటు తమిళ రాజకీయాల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. అయితే మరి ఈ దెబ్బ నుండి కోలుకోవడం అంత సులభం కాదంటున్నారు నిపుణులు. చూద్దాం మున్ముందు తమిళనాట ఇంకెన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయో...!