వివాదాస్పద బయోపిక్‌లు తీయాలంటే ఎంతో తెగువ, విమర్శలు, దాడులకు జంకని నైజం ఉండాలి. చరిత్రను వక్రీకరించకుండా, నిజ జీవితంతో జరిగిన సంఘటనలను యథాతథంగా చూపగలగాలి. కానీ మనకు వర్మ తప్ప అలాంటి తెగువ ఉన్న దర్శకుడు ఎవ్వరూ లేరు. సిల్క్‌స్మిత బయోపిక్‌గా తెరకెక్కిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో కూడా ఆ చిత్ర దర్శకుడు కాస్త ధైర్యం చూపి సిల్క్‌స్మితను వాడుకున్న ఓ సూపర్‌స్టార్ పాత్రను చూపించారు. ఇక ప్రస్తుతం అశ్వనీదత్ కూతురుకి చెందిన బేనర్‌లో అశ్వనీదత్ అల్లుడు 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి బయోపిక్ రూపొందనుంది. ఇక సినిమా వారి జీవితాలలో అందునా నటీమణుల విషయంలో ఎన్నోవార్తలు, నిజాలు ఉంటాయి. ఆనాటి కాలం వారికి మరీ ముఖ్యంగా ఆనాటి సీనియర్ ఇండస్ట్రీ వ్యక్తులకు, మీడియా వారికి వారి నిజజీవిత ఎత్తుపల్లాలు కూడా తెలుసు.
ఇక మహానటి సావిత్రీ జీవితం అంటే జమునతో పాటు స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్, జెమినీ గణేషన్ వంటి మహామహుల పాత్రలు ఖచ్చితంగా ఉంటాయి... ఉండాలి కూడా. ఇక కొందరు స్వర్గీయ మహానటులు, నేడు దేవుళ్లుగా వెలుగొందుతున్న పలువురు కుల దైవాల వ్యక్తులు ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించారనేది కూడా వాస్తవమే. మరి నాగ్ అశ్విన్‌కి ఆ గట్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ అశ్వనీదత్‌కి మాత్రం అంత ధైర్యం లేదు. సో.. ఈ చిత్రాన్ని కేవలం మహానటి సావిత్రి అభిమానులను, నిజాలు చూపిస్తారేమోనన్న ఆశ ఉన్న ప్రేక్షకులను ఆకర్షించేలా.. ఓ కమర్షియల్ సక్సెస్‌ను సాధించేలా ఈచిత్రం స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. అంతవరకు అది వారిష్టమే.. కానీ.. దానికి సావిత్రి బయోపిక్‌గా చెప్పడం మాత్రం ఆత్మవంచనే అవుతుంది.