తెలుగు ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా, కార్మిక పక్షపాతిగా, దాసరి తర్వాత పలు వివాదాలను పరిష్కరించే వ్యక్తిగా, మరీ ముఖ్యంగా ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టే వానిగా దర్శకనిర్మాత తమ్మారెడ్డిభరద్వాజకు పేరుంది. ఎన్ని ఫ్లాప్‌లు, నష్టాలొచ్చినా ఆయన తాను నమ్ముకున్న సిద్దాంతాలను ఎప్పుడు వదులుకోలేదు. ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ.. గతంలో మాటీవీ, జెమిని, జీటీవీ వంటి చానెల్స్‌లో తప్పుడు ప్రోగ్రాలు, ద్వందార్దాలు, బూతులు, పలువురిని కించపరిచే కార్యక్రమాలు వచ్చినప్పుడు తానే డైరెక్ట్‌గా ఫొన్ చేసి యాజమాన్యానికి ఇది తప్పు అని చెప్పాడు. కానీ మీడియా మొఘల్‌గా పేరున్న ఏకచ్చత్రాధిపత్యంగా తెలుగు మీడియాను శాసిస్తున్న రామోజీరావును మాత్రం ఆయన భయపడుతూ విమర్శించాడు.
ఈటీవీలో వస్తున్న పలు కార్యక్రమాలు బాగా లేవని, సమరం కార్యక్రమాల కంటే ఘోరంగా ఉన్నాయంటున్నాడు. రామోజీరావు ఒకసారి తన మిత్రునితో రాత్రి 9గంటలకు వచ్చే వార్తల తర్వాత అధికశాతం మంది టీవీలు ఆఫ్ చేస్తారని, ఆ సమయం తర్వాత వచ్చే ప్రోగ్రాంలు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఫర్వాలేదనే వాదనను తాను ఖండించినట్లు చెప్పాడు. ఇక తాను మాటీవీ, జీటీవీ యాజమాన్యాల మాదిరిగా రామోజీకి ఫోన్ చేయలేదనని, తన ఫోన్‌ను ఆయన ఎత్తుతాడో లేదో అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌డైరెక్ట్‌గా అయినా ఈ విషయం రామోజీకి తెలియాలని తాను మాట్లాడుతున్నట్లు నీళ్లు నమిలాడు.
కానీ ఇక్కడ ఒకటి మాత్రం మరువకూడదు. మనం ఎవరితోనైనా ఏకీభవించనప్పుడు రామోజీ అయినా మోదీ అయినా ఒక్కటే. కానీ రామోజీకి ఉన్న రాజకీయ, ఇతర పలుకుబడులు చూసి తమ్మారెడ్డి తనలోని ఆవేశాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోయాడా? అనే అనుమానం వస్తోంది.