మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ ఫస్ట్ లుక్ గురించి మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుండో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల క్రితమే మొదలైన మహేష్ చిత్రం షూటింగ్ గురించి ఎటువంటి న్యూస్ మీడియాకి దొరకడంలేదు. అదిగో ఫస్ట్ లుక్, ఇదిగో ఫస్ట్ లుక్ వచ్చేస్తుందంటూ ఊరిస్తున్నారే తప్ప ఇంతవరకు దాని జాడలేదు. మరోపక్క మహేష్ అభిమానుల్లో నిరాశ రోజురోజుకి పెరిగిపోతుంది. కనీసం టైటిల్ ని కూడా ఎనౌన్స్ చెయ్యకుండా ఊరిస్తున్న మురుగదాస్ ఎట్టకేలకు మహేష్ చిత్రం ఫస్ట్ లుక్ గురించి స్పందించాడు.
మహేష్ చిత్ర టైటిల్ 'స్పైడర్' అని ప్రచారంలో వుంది. దాదాపు 'స్పైడర్' టైటిల్ ఖాయమనే అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెల 12 అంటే రేపు బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ మురుగదాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసాడు. ఈ వార్త విన్నప్పటినుండి మహేష్ లుక్ ఎలా ఉంటుందో.. అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. ఇక ఈ ఆత్రుత రేపటి వరకు కొనసాగాల్సిందే మరి. ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.