బాహుబలి తో మొత్తం ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ఇప్పుడు దేశంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్ ని తలదన్నే రీతిలో ఉంది. అలాంటి రాజమౌళితో ఒక్క సినిమా చేసినా చాలానే కోరికను బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, మల్లు వుడ్ సూపర్ స్టార్స్ అంతా కోరుకుంటున్నారు. ఆ రేంజ్ లో రాజమౌళి పేరు దేశం మొత్తం మార్మోగిపోతోంది. ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ విడుదలకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ చిత్ర పబ్లిసిటీ కార్యక్రమాలను పెంచేశారు బాహుబలి టీమ్.
మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగ వైభవంగా నిర్వహించిన రాజమౌళి చెన్నైలో బాహుబలి తమిళ వెర్షన్ ప్రెస్ మీట్ పెట్టాడు.. ఆ ప్రెస్ మీట్ కి ప్రభాస్, అనుష్క, తమన్నా,రమ్యకృష్ణ, రాజమౌళి, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి తన మనసులో ఎప్పటినుండో ఉన్న కోరికను బయటపెట్టాడు. నాకు ఎప్పటినుండో సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో సినిమా చేయాలనీ ఉందని చెప్పాడు. ఎప్పటికైనా ఆ కోరిక నెరవేరుతుందని తెలిపాడు.
అసలు ఇంతకుముందే రజినీకాంత్ కూడా తనకు రాజమౌళి లాంటి దర్శకుడితో పని చెయ్యాలని ఉందనే కోరికను వెలిబుచ్చిన విషయం తెలిసిందే. మరి అటు రాజమౌళి ఇటు రజినికాంత్ కూడా వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాలని సుముఖం గా వున్నారు కాబట్టి వారి కాంబినేషన్ లో అతి త్వరలోనే భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలని ఆశిద్దాం.