ప్రతిపక్షనేత జగన్ విషయంలో బాబు చాణక్యం చూపిస్తున్నాడు. రాష్ట్రం స్థిరంగా అభివృద్ది చెందాలంటే తనవంటి నాయకుడే దీర్ఘకాలం ఏపీకి సీఎంగా ఉండాలని చెబుతున్నాడు. మరోపక్క ఒకప్పటి అధ్యక్షతరహా పాలనను మరలా తెరపైకి తెస్తున్నాడు. జగన్‌కి ఢిల్లీ పెద్దలు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై మండిపడుతున్నాడు. ఇక జగన్‌ను పదే పదే ఆర్థిక నేరస్తుడని చెబుతున్నాడు. కానీ చట్టపరంగా జగన్ ఇప్పటివరకు చాలా కేసుల్లో ముద్దాయే కానీ నేరస్తుడు కాదు. ఆయనపై ఇంకా ఏ కోర్టు దోషిగా నిర్ధారించలేదు. కానీ చంద్రబాబు తన చాణక్యంతో తానే కాకుండా తన మంత్రి వర్గంలోని మంత్రులు, నాయకులతో జగన్ ఆర్థిక నేరస్తుడని గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల్లో జగన్ నేరస్థుడు అనే ముద్ర వేయడంలో సఫలమవుతున్నాడు.
కానీ దీనిని జగన్ సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాడు. అనుభవజ్ఞుల కొరత, ఒంటెద్దు పోకడలు, అనుభవరాహిత్యం వల్ల జగన్ ఈ విషయంలో పైచేయి సాధించలేకపోతున్నాడు. రాంజఠ్మలాని, సుబ్రహ్మణ్యస్వామి వంటివారిని ఆశ్రయించి, తనను నేరస్థుడు అని ప్రచారం చేస్తున్నందుకు జగన్ కోర్టులో పరువు నష్టం దావా వేస్తే చంద్రబాబు మాటలకు అడ్డుకట్టపడుతుంది. తద్వారా జగన్‌కు ప్రజల్లో కూడా మంచి ఆదరణ పెరుగుతుంది. ఈ విషయంలో జగన్ విఫలమవుతున్నాడు...!