'బాహుబలి ద కంక్లూజన్' ఈనెల 28 న విడుదల కాబోతుంది. ఇక బాహుబలి సినిమా విడుదలయ్యాక రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఏ హీరోతో చేస్తాడనే దానిమీద అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైపోయింది. ఆ మధ్యన రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడు అని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొట్టి పడేశాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి బాలీవుడ్ కి చెక్కేస్తున్నాడని... సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించబోతున్నాడనే ప్రచారమూ జరిగింది.
కానీ ఇప్పుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ' చిత్రాలు వచ్చాయి. ఇక రాజమౌళితో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎన్టీఆర్ ఎప్పటినుండో కాచుకుని కూర్చున్నాడు. అందుకే వీలున్నప్పుడల్లా జక్కన్న ని పొగుడుతూ నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అంటూ అడుగుతుంటాడు. అయితే ఇప్పుడు 'బాహుబలి' సినిమా విడుదల కాగానే రాజమౌళి రెండు నెలలు రెస్ట్ తీసుకుని ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఆలోచిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.
అయితే ఎన్టీఆర్ తో మహాభారతాన్ని తెరకెక్కిస్తాడా? లేక ఏదైనా ఇతర కథతో సినిమా చేస్తాడా? అనేది క్లారిటీ లేదుగాని ఎన్టీఆర్ తో మాత్రం సినిమా పక్కా అంటున్నారు. ఇక ఈ రెండు మూడు నెలల్లో బాబీ డైరెక్షన్ లో కమిట్ అయిన చిత్రాన్ని త్వరత్వరగా కంప్లీట్ చేసి రాజమౌళి తో చేసే సినిమాకి ఎన్టీఆర్ పూర్తిగా సిద్ధమవుతాడని చెబుతున్నారు. చూద్దాం రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా నిజంగా ఒకే అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ ప్రకారం ఎన్టీఆర్ పంటపండినట్లే.