దేశానికి వెన్నెముక అయిన రైతుల పంట రుణ మాఫీలు.. ఆర్ధిక వ్యవస్థను, ఆర్ధిక సమతుల్యాన్ని నాశనం చేస్తాయని, విపరీతపోకడలకు దారి తీస్తాయని ఆర్బీఐ గవర్నర్ నొక్కి వక్కాణించాడు. రైతులకు రుణమాఫీ అనేది చెడు సంప్రదాయమని, వాటిని తాము ప్రోత్సహించమని, ఇవి నైతిక ప్రమాణాలకి ముప్పు అని, ఓటు రాజకీయాల కోసం ఆర్దిక క్రమశిక్షణను దెబ్బతీయవద్దని ఆయన కోరారు. కానీ మాల్యావంటి బడా బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం బ్యాంకులు సరైన ష్యూరిటీలు, ఇతర ప్రమాణాలు పాటించకుండా కోట్లకు కోట్లు, వేల కోట్లు ఎలా ఇస్తున్నాయి? వారు బ్యాంకులకు వాటిని ఎగ్గొట్టడం చెడు సంప్రదాయం కాదా? అనేవి ఆర్బీఐ అధినేతకే తెలియాలి.
ఎందరో బడా బడా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు వంగి వంగి సలాం చేస్తూ వేల కోట్ల రుణాలను ఇస్తున్నాయి. దీనికి అధికారంలో ఉన్న నాయకుల ఒత్తిడి కూడా ప్రదాన కారణం. ఉత్పాదకతను పెంచుతామని, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పి వారు చేస్తున్న దారుణాలు, ఆర్థిక నేరాలు చిన్నవి కావు. రైతులకు పదివేలు ఇవ్వడానికి లక్ష కండీషన్లు పెట్టే బ్యాంకులు మరి ఈ డొల్ల కంపెనీలకు అలా కోట్లకు కోట్లు ఇవ్వడాన్ని మనం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? అధికారంలో ఉండేది యూపీఏ మన్మోహన్‌సింగైనా, బిజెపి మోదీ అయినా, చంద్రబాబు, జగన్.. ఇలా ఎవరురున్నా సరే... జరిగేది మాత్రం ఈ అక్రమాలే కదా...! ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...!