తాజాగా జరిగిన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ కీలక సమావేశానికి చిరంజీవి హాజరుకాలేదు. దాంతో ఈ భేటీ అనంతరం ఆ పార్టీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి పళ్లంరాజు, మరో ఎంపీ, మాజీ మంత్రి జెడి శీలంతో కలిసి మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి పలు పనులతో బిజీ బిజీగా ఉన్నారని, ఈమధ్య ఆయన సినిమాలలో కూడా బిజీ అయిన విషయాన్ని వారు విలేకరులకు వివరించారు.
చిరంజీవి కాంగ్రెస్‌పార్టీని వీడే ప్రసక్తే లేదని తమతోనే కలకాలం ఉంటారని వారు చెప్పారు. ఇక తాను సమావేశానికి హాజరు కావడం లేదని చిరు తమకు ముందుగానే తెలిపారన్నారు. మరి చిరంజీవి విషయంలోనే వీరు ఇంతగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆ సమావేశానికి ఇంకా పలువురు ప్రముఖులు కూడా హాజరుకాలేదు కదా...! అనే చర్చ నడుస్తోంది.
ఇక ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి తాము మరలా అధికారంలోకి వస్తామని, జరిగిన పొరపాట్లను గుర్తించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి ఆశావాదం ఉండవచ్చు కానీ.. మరీ ఇంతలా భ్రమలో బతకాల్సిన అవసరం లేదనే చెప్పాలి.